'నీట్' వల్ల 16 ఆత్మహత్యలు...తమిళనాట ఏం జరుగుతోంది?

'నీట్' లో క్వాలిఫై కాలేదని తండ్రీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది

Update: 2023-08-15 11:30 GMT
నీట్ వల్ల 16 ఆత్మహత్యలు...తమిళనాట ఏం జరుగుతోంది?
  • whatsapp icon

'నీట్' లో క్వాలిఫై కాలేదని తండ్రీ కొడుకులు ఆత్మహత్య  చేసుకున్న ఘటన తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పైగా "నీట్‌" నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ను రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో వీరి ఆత్మహత్య తీవ్ర చర్చనీయాంశమైంది.

అవును... చెన్నైలోని క్రోమ్‌ పేట్‌ లో జీవించే జగదీశ్వరన్ నీట్ లో క్వాలిఫై కాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కొడుకు లేడని, ఒంటరితనంతో కుమిలిపోయిన తండ్రి సెల్వశేఖర్ కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజులకే తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

వివరాళ్లోకి వెళ్తే... చెన్నైలోని క్రోమ్‌ పేట్‌ లో జీవించే సెల్వశేఖర్ భార్య నుంచి విడిపోయినప్పటినుంచీ కొడుకుతో విడిగా జీవించేవారు. ఈయన వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. ఆయన కొడుకు జగదీశ్వరన్ ఓ సీబీఎస్ఈ స్కూల్లో 12వ తరగతి వరకూ చదువుకున్నాడు. ట్వల్త్ లో అతడికి 500కి 424 మార్కులు వచ్చాయి.

గత రెండేళ్లుగా నీట్‌ రాస్తూ మెడికల్ కాలేజీలో సీటు కోసం ప్రయత్నిస్తున్న జగదీశ్వరన్... ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు తెచ్చిపెట్టే స్కోరు మాత్రం సాధించలేకపోతున్నాడు. అయినా మూడోసారి కూడా ప్రయత్నించాలని భావించాడు. తండ్రి అందుకు ఫీజు కూడా కట్టాడు. ఈలోపే జగదీశ్వరన్ ఆత్మహత్య చేసుకున్నాడు.

శనివారం కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సెల్వశేఖర్‌ ను ఓదార్చేందుకు బందుమిత్రులంతా.. సోమవారం సెల్వశేఖర్‌ అంత్యక్రియలను చూసేందుకు మళ్లీవచ్చారు. ఈ మధ్యలో ఆదివారం సెల్వశేఖర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తమిళనాట 'నీట్' వల్ల 16 ఆత్మహత్యలు!:

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో... నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే దీన్ని మొదట్నుంచీ తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ క్రమంలో నీట్ లో క్వాలిఫై కాలేని కారణంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో అధికారికంగా సుమారు 16 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా.. నీట్ లో క్వాలిఫ కాలేదని 2017 సెప్టెంబరులో అరియాలూర్ జిల్లాకు చెందిన అనిత ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు ట్వల్త్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చినప్పటికీ నీట్ ద్వారా వైద్య కళాశాలలో సీటు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్య తర్వాత రాష్ట్రంలో "నీట్‌"పై వ్యతిరేకత మరింత ఎక్కువైంది.

ఆ మరుసటి ఏడాది విల్లుపురం జిల్లాకు చెందిన ప్రదీప కూడా ట్వల్త్ లో మంచి మార్కులు వచ్చినా... నీట్‌ లో స్కోర్ రాకపోవడంతో ప్రదీప కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత తిరుచ్చికి చెందిన శుభశ్రీ, చెన్నైకు చెందిన ఏంజెలీన్ శ్రుతి, తిరుపూర్‌ కు చెందిన రితూ శ్రీ.. ఇలా 16 మంది నీట్ వల్ల రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు!

నీట్ రద్దుకు ప్రభుత్వం బిల్లు:

రాష్ట్రంలో నీట్ పరీక్షను రద్దు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం చాలాకాలం నుంచీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2019లోనే అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయంలో ఒక బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లును ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపించారు.

ఆ తర్వాత రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మళ్లీ కొత్త నీట్ బిల్లును స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించింది. కానీ, ఈ బిల్లును గవర్నర్ ఆర్.ఎన్. రవి అసెంబ్లీకి తిప్పి పంపించారు. మళ్లీ ఈ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ.. ఈసారి అనుమతి కోసం రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది.

Tags:    

Similar News