యూఎస్ కి ఎన్టీఆర్‌... ఫ్యాన్స్ లో తీవ్ర అసంతృప్తి

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా రూపొందిన 'దేవర' సినిమాను ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Update: 2024-09-23 05:53 GMT

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా రూపొందిన 'దేవర' సినిమాను ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ప్లాన్‌ చేసిన మేకర్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. నోవాటెల్‌ హోటల్‌ లో ఈ భారీ ఈవెంట్‌ ను ప్లాన్ చేసిన మేకర్స్‌ అంచనాలు తల కిందులు అయ్యాయి. అనుకున్న దాని కంటే అభిమానులు దాదాపు రెట్టింపు రావడంతో తొక్కిసలాట జరిగి, భద్రత పరమైన కారణాల రిత్యా ఈవెంట్ ను క్యాన్సల్‌ చేయడం జరిగింది. ఆదివారం రాత్రి జరగాల్సిన ఈవెంట్ ను ఒకటి రెండు రోజుల తర్వాత చేస్తారేమో అనే అభిప్రాయంతో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు జల్లినట్టు ఎన్టీఆర్ యూఎస్ కి వెళ్లబోతున్నారు.

దేవర సినిమా ఈవెంట్‌ ఇక లేనట్లే అని తేలిపోయింది. ఎన్టీఆర్‌ ఒకటి లేదా రెండు రోజుల్లో యూఎస్ కి వెళ్లబోతున్నారు. ఈనెల 26వ తారీకున బియాండ్‌ ఫెస్ట్‌ లో దేవర స్క్రీనింగ్‌ కి లాస్ ఏంజిల్స్ కి వెళ్లబోతున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయాన్ని దృవీకరించారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఈవెంట్స్ లో ఎన్టీఆర్‌ పాల్గొనడం లేదని తేలిపోయింది. సినిమా హిట్ టాక్ దక్కించుకుంటే విడుదల అయిన వారం రోజుల తర్వాత భారీ ఈవెంట్‌ ను నిర్వహించి ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్‌ సభ్యులు కృతజ్ఞతలు చెప్పే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా లో ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు. తెలుగు లో మొదటి సారి జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించిన సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ తెలుగు సినిమాల్లో ఎప్పుడెప్పుడు నటిస్తుందా అంటూ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు దేవర సినిమా తో ఆ లోటు తీరబోతుంది. జాన్వీ కపూర్ ను దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూడాలని ఆశ పడ్డ శ్రీదేవి ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ మిగిలింది. జాన్వీ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ సోలో హీరోగా నటించిన సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అందుకే దేవర సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు కొరటాల శివ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందించడం జరిగింది. అద్భుతమైన కథ తో ఈ సినిమాను కొరటాల శివ రూపొందించాడు అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తో పాటు ప్రతి ఒక్కరూ దేవర సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన దేవర అడ్వాన్స్ బుకింగ్‌ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు మొదలు అవుతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News