OG కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూపులు

సినిమాలు, రాజ‌కీయాల్ని జోడుగుర్రాల్లా ప‌రిగెత్తించ‌డం సులువు కాదు. ఇది క‌చ్ఛితంగా రెండు ప‌డ‌వ‌ల పయ‌న‌మే.;

Update: 2025-03-05 10:25 GMT

సినిమాలు, రాజ‌కీయాల్ని జోడుగుర్రాల్లా ప‌రిగెత్తించ‌డం సులువు కాదు. ఇది క‌చ్ఛితంగా రెండు ప‌డ‌వ‌ల పయ‌న‌మే. ఏ నావ ఎటు వెళుతుందో చెప్ప‌లేం. రాజ‌కీయ నాయ‌కుల‌కు స‌మ‌యం చాలా త‌క్కువ ఉంటుంది. ఆక‌స్మిక ప్ర‌యాణాలు, స‌మావేశాలు ఉంటాయి. తీవ్ర‌మైన ఒత్తిళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని ప్ర‌భావం సెట్స్ పై ఉన్న‌ సినిమాల‌పై ప‌డుతుంది. ఒక్కో సినిమాకి వంద మంది పైగా ప‌ని చేస్తుంటారు గ‌నుక‌, వీళ్లంతా ఒక‌రి కోస‌మే ఎదురు చూపులు చూడాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. అలాగే సినిమాపై కొన్ని కుటుంబాలు, జీవితాలు కూడా ఆధార‌ప‌డి ఉంటాయి. అలాంట‌ప్పుడు ఒక‌రి కోసం ఇత‌రులు వేచి చూడ‌డం కూడా స‌బ‌బు కాదు.

కానీ ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా ఒక‌రి కోసం వంద మంది ఎదురు చూడ‌గ‌ల‌రు. అత‌డే `ఓజీ`. ది గ్రేట్ ప‌వ‌న్ క‌ల్యాణ్. జనసేనానిగా అతడు ప్ర‌జ‌ల్లో ఉన్నాడు. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌డ‌మే ధ్యేయంగా అత‌డు ముందుకు సాగుతున్నాడు. అంత‌కంత‌కు జన‌సేనాని ఇమేజ్ ప్ర‌జ‌ల్లో పెరుగుతోంది. అయితే రాజ‌కీయాలు ఏరోజు ఎలా మార‌తాయో తెలీదు. ఒత్తిళ్ల‌ను ఎదుర్కొని ప‌వ‌న్ ఇంకా చాలా సాధించాల్సి ఉంటుంది. దీనికోసం అత‌డు నిరంత‌రం శ్ర‌మిస్తున్నాడు.

అయితే ఇలాంటి ప‌రిస్థితిలోను అత‌డు అభిమానుల కోరిక‌ను కాద‌న‌లేక సినిమాలు చేస్తున్నారు. త‌న‌కు రాజ‌కీయాల నుంచి సంపాద‌న కుద‌ర‌దు కాబ‌ట్టి సినిమాల‌తో సంపాదించిన దానిని రాజ‌కీయాల్లో పెడతాన‌ని మాటిచ్చాడు. అయితే ఇదే కొన్ని చిక్కులు తెచ్చి పెడుతోంది. చాలా కాలంగా అత‌డు న‌టించాల్సిన సినిమాల‌న్నీ పెండింగులో ఉన్నాయి. ఏళ్ల త‌ర‌బ‌డి ఓజీ, హ‌రి హ‌ర వీర మ‌ల్లు, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ లాంటి భారీ చిత్రాల షూటింగులు పూర్తి కాక‌పోవ‌డానికి ప‌వ‌న్ అందుబాటులో లేక‌పోవ‌డ‌మే కార‌ణం. రాజ‌కీయాలు, సినిమాల‌ను బ్యాలెన్స్ చేస్తూ వీటిని పూర్తి చేయ‌డం సాధ్య‌ప‌డ‌డం లేదు.

ఇక సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ సినిమా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ 10-12 రోజుల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే పెండింగ్ ఉన్నా ప‌వ‌న్ దానికోసం రాలేని ప‌రిస్థితి. ఓజీ పోస్ట‌ర్, టీజ‌ర్ తో ఫ్యాన్స్ లో అగ్గి రాజేసాడు. కానీ పెరిగిన హైప్‌ని అత‌డు ఎన్ క్యాష్ చేసుకోవ‌డంలో టీమ్ విఫ‌ల‌మ‌వుతోంది. ఈ సినిమా రిలీజ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుండ‌డంతో బ‌జ్ త‌గ్గిపోతుంద‌నే ఆందోళన ఉంది. నిజానికి ఫ్యాన్స్ ఓజీ కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. కానీ రిలీజ్ తేదీ ఎప్పుడో చెప్ప‌లేని స్థితి ఉంది. ఈ డైల‌మాను క్లియ‌ర్ చేయ‌డానికి ప‌వ‌న్ ని సుజీత్ అత‌డి బృందం ప‌దే ప‌దే సంప్ర‌దించినా కానీ ప‌వ‌న్ క్లారిటీ ఇవ్వ‌లేద‌ట‌. ఓజీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే ప‌వ‌న్ న‌టిస్తున్న హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీ `హరి హర వీర మల్లు` ఎప్ప‌టికి విడుద‌ల‌వుతుందో ఇంకా స్ప‌ష్ఠ‌త లేదు. `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రీక‌ర‌ణను కూడా పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇది ఇప్ప‌ట్లో సాధ్య‌ప‌డేట్టు క‌నిపించ‌డం లేదు. దీంతో హ‌రీష్ శంక‌ర్ కూడా చాలా కాలంగా వెయిటింగ్. అత‌డి డైల‌మాకు అంతూ ద‌రీ లేదు. క‌నీసం ఓజీ షూటింగ్ పూర్త‌యినా అభిమానుల‌కు శుభ‌వార్త అందేది. కానీ ప‌వ‌న్ నుంచి స్పంద‌న లేదు.

Tags:    

Similar News