ప్రేమలు.. తెలుగులో పరిస్థితి ఏంటి?

ఒక భాషలో హిట్టయిన సినిమా, మరో భాషలో హిట్ అవ్వాలని లేదు. అలానే ఒక భాషలో ఫ్లాప్ మూవీ, మరో చోట అదే రిజల్ట్ అందుకుంటుందనీ చెప్పలేం.

Update: 2024-03-13 04:03 GMT

ఒక భాషలో హిట్టయిన సినిమా, మరో భాషలో హిట్ అవ్వాలని లేదు. అలానే ఒక భాషలో ఫ్లాప్ మూవీ, మరో చోట అదే రిజల్ట్ అందుకుంటుందనీ చెప్పలేం. ఎందుకంటే ఆడియెన్స్ పలు రకాలు. వారి ఆలోచనలు, అభిరుచులు, అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందుకే ఆడియన్స్ ఎప్పుడు ఏ సినిమాని ఆదరిస్తారో, ఎలాంటి చిత్రాలని హిట్ చేస్తారో తలపండిన సినీ పండితులు కూడా చెప్పలేరు. ఒక్కోసారి పక్క భాషలో తీసిన డబ్బింగ్ సినిమాలను నెత్తిన పెట్టుకుంటే.. ఇంకోసారి ఎంత మంచి కంటెంట్ తో వచ్చినా పరభాషా చిత్రాలను పెద్దగా పట్టించుకోరు. ఆ తర్వాత ఓటీటీలో చూసి, ఇలాంటి మూవీని థియేటర్లలో ఎందుకు చూడలేదో అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటారు.

'పొన్నియన్ సెల్వన్' సినిమా తమిళంలో హిట్టయింది కానీ, తెలుగు ప్రేక్షకులకి ఎక్కలేదు. గతంలో మన దగ్గర ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసిన 'మగధీర' 'రంగస్థలం' 'శ్రీమంతుడు' లాంటి సినిమాలని తమిళ తంబీలు తిరస్కరించారు. బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకున్న 'పుష్ప' మూవీ తెలుగులో కంటే హిందీలో విపరీతంగా ఆడేసింది. అంతకముందు తెలుగులో నిరాశ పరిచిన 'సాహో' సినిమా.. నార్త్ బెల్ట్ లో వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక్కడ హిట్టయిన 'విరూపాక్ష' చిత్రాన్ని డబ్బింగ్ చేసి ఇతర భాషల్లో రిలీజ్ చేస్తే, అక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

కన్నడ డైరెక్టర్ తెరకెక్కించిన ‘సలార్’ సినిమా అన్ని భాషల్లోనూ అద్భుతంగా వసూళ్లు రాబట్టింది కానీ, కన్నడలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. గతేడాది తమిళ డైరెక్టర్ హిందీలో తీసిన 'జవాన్' మూవీ.. తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడింది. ఇక ఈ సంక్రాంతి పండక్కి వచ్చిన 'గుంటూరు కారం' సినిమా.. ఆంధ్రాలో మంచి వసూళ్లు సాధించింది కానీ, తెలంగాణలో నైజాం మినహా మిగతా ఏరియాల్లో పెద్దగా కలెక్ట్ చెయ్యలేకపోయింది.

ప్రేమలు.. తెలుగులో పరిస్థితి ఏంటి?

ఇప్పుడు లేటెస్టుగా మలయాళంలో మంచి విజయం సాధించిన 'ప్రేమలు' సినిమాని తెలుగులోకి డబ్ చేసి, శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు. ఇది అక్కడ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకున్న బ్లాక్ బస్టర్ మూవీ. కానీ ఎందుకనో మన జనాలకు పెద్దగా ఎక్కలేదు. యూత్ ఆడియన్స్ కూడా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నేపథ్యం ఉన్నప్పటికీ ఇక్కడి వారికి కనెక్ట్ అవ్వలేదు. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన మేర ప్రభావం కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

'ప్రేమలు' మూవీ మల్టీఫ్లెక్స్ లలో అంతో ఇంతో వసూలు చేస్తోంది కాబట్టి, మహా అయితే బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు. కానీ మలయాళంలో వచ్చిన సక్సెస్ తో కంపేర్ చేసి చూస్తే మాత్రం, తెలుగులో ఈ సినిమా నిరాశ పరిచినట్లే అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఎస్.ఎస్ కార్తికేయ రిలీజ్ చేసిన ఈ చిత్రానికి.. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు, నాగచైతన్య, అనిల్ రావిపూడి లాంటి సినీ ప్రముఖులు సపోర్ట్ గా నిలిచారు. వీరి ప్రచారం ఈ వారంలో సినిమా పుంజుకోవడానికి ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూడాలి.

ఇకపోతే మలయాళంలో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన 'మంజుమ్మల్ బాయ్స్' మూవీని కూడా తెలుగులో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 15న ఈ సర్వైవల్ డ్రామాని రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అక్కడ 160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు అలరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News