రణబీర్ ఒరిజినల్ జీవితమే యానిమల్‌లో?
రణబీర్ కపూర్ తన దివంగత తండ్రి రిషి కపూర్‌తో ఎప్పుడూ సన్నిహితంగా లేడు.
రణబీర్ కపూర్ తన దివంగత తండ్రి రిషి కపూర్‌తో ఎప్పుడూ సన్నిహితంగా లేడు. వారి మధ్య సంక్లిష్టమైన కష్టమైన సంబంధం గురించి రణబీర్ చాలాసార్లు బహిరంగంగా మాట్లాడారు. తమ మధ్య ప్రేమాభిమానాలు ఎంతగా ఉన్నా కానీ తండ్రి అంటే రణబీర్ కి భయం. రిషీజీకి స్వతహాగా కోపం ఎక్కువ. అందుకే ఇద్దరి మధ్యా ఆ గ్యాప్ అలానే ఉండిపోయింది. నాన్నంటే పిచ్చి ప్రేమ కానీ దానిని చెప్పేంత అవకాశం రణబీర్ కి లేదు. కొడుకు అంటే ఉన్న ప్రేమను అతడు చెప్పలేకపోయాడు. ఇదంతా వింటుంటే యానిమల్ స్టోరిలా ఉందని కూడా అనిపించకమానదు. ఒక రకంగా యానిమల్ లో తన ఒరిజినల్ లైఫ్ పాత్రనే రణబీర్ పోషించాడని కూడా అంగీకరించాలి.
నిజానికి తండ్రితో తన సంబంధం సన్నిహితంగా లేదని రణబీర్ అంగీకరించారు. రిషి తరచుగా వారి సంబంధాన్ని గాజు గోడతో పోల్చాడు. వారు ఒకరినొకరు చూడగలరు.. కానీ ఒకరినొకరు తాకలేరు లేదా అనుభూతి చెందలేరు. రణబీర్ కూడా తన తండ్రి పట్ల తనకున్న భయాన్ని బయటపెట్టాడు. అతడు తన తండ్రి కళ్ళను ఎప్పుడూ సూటిగా చూడలేదని అంగీకరించాడు. నాన్న ఏం చెప్పినా ఎల్లప్పుడూ వంగి ప్రతిదానికీ అంగీకరిస్తాడు.
అయితే బెదిరింపు కారణం కాదు.. తన తండ్రి పట్ల మక్కువతో ఉన్న యానిమల్‌లోని తన పాత్ర(రణ్‌విజయ్)లా కాకుండా, అతను నిజంగా తన తండ్రికి భయపడతానని స్పష్టం చేశాడు. అతని తండ్రి వారిని ఎప్పుడూ శారీరకంగా హింసించకపోయినా కానీ.. తన తండ్రి అస్థిర స్వభావం రణబీర్‌ను ఆందోళనకు గురి చేసింది. తన తల్లితో నిత్యం ఘర్షణ పడేవాడు. ఆ సమయంలో తాను దూరంగా మెట్లపై కూచుని బాధపడేవాడు. గొడవ జరిగినప్పుడు తనతో చెప్పుకుని అమ్మ బాధపడేదని కూడా రణబీర్ వెల్లడించాడు.
పాతకాలం ప్రవర్తన అనుకోవచ్చా? ఆ కాలం ఆయన ప్రవర్తనను ప్రభావితం చేసిందా? అని ప్రశ్నిస్తే.. ఆ తరం పురుషులు తరచుగా దుర్బలత్వంతో పోరాడారని రణబీర్ పేర్కొన్నాడు. తన తండ్రి ఎప్పుడూ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయలేదని, చాలా అరుదుగా తన చేతిని పట్టుకున్నాడని.. అతడు తనను కౌగిలించుకున్నప్పుడు అది ఒక కుండ (చలనం లేనిదిగా) లాగా ఉందని రణబీర్ పేర్కొన్నాడు. తన తండ్రి తరంలో అలా ఉండేదని రణబీర్ అంగీకరించాడు.
తండ్రి కొడుకుల నడుమ ప్రేమ ఆప్యాయతలు ఎన్ని ఉన్నా, తండ్రిగా తనపై శ్రద్ధ చూపించినా కానీ.. అతడు భావోద్వేగం పరంగా తండ్రితో దూరాన్ని గుర్తించాడు. రిషీజీ తో రణబీర్ దూరాన్ని నిజానికి సందీప్ వంగా యానిమల్ లోకి తెలివిగా అడాప్ట్ చేశాడని అతడి మాటలను బట్టి అర్థమవుతోంది. తన తండ్రి తిరిగి వస్తే తనతో ఎక్కువ సమయం గడపాలనుందని కూడా రణబీర్ అన్నాడు. రణబీర్ కపూర్ ప్రస్తుతం అలియా భట్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2022లో తమ కుమార్తె రాహాకు స్వాగతం పలికారు.