పాన్ వ‌ర‌ల్డ్ లో టాలీవుడ్ మీసం తిప్ప‌డం వెన‌క‌

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేయడంలో రానా బలమైన స్తంభాలలో ఒకడిగా నిలుస్తున్నాడు

Update: 2023-07-25 04:59 GMT

తెలుగు సినిమా నేడు అంత‌ర్జాతీయ మార్కెట్ ని అందుకునే దిశ‌గా ప్ర‌యాణిస్తోంది. మునుముందు హాలీవుడ్ తో పోటీప‌డే సినిమాలు భార‌త‌దేశంలో టాలీవుడ్ నుంచే దూసుకువ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం పెరుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ సైతం టాలీవుడ్ స్టార్లు ద‌ర్శ‌కుల‌కు సాహో అంటోంది. మ‌న దర్శ‌క హీరోల్ని త‌మ సినిమాల్లో భాగం చేస్తేనే త‌మ‌కు మ‌నుగ‌డ అని న‌మ్ముతోంది. పాన్ ఇండియా మార్కెట్ పై ప‌ట్టుకోసం చాలా ఈగోల్ని ప‌క్క‌న పెట్టి మ‌రీ మ‌న‌వాళ్ల‌తో క‌లిసిపోతున్నారు హిందీ హీరోలు. బాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ‌లు తెలుగు స్టార్ల‌ను త‌మ సినిమాల్లో భాగం చేయ‌డం ద్వారా ద‌క్షిణాది మార్కెట్ ని కొల్ల‌గొట్టాల‌ని పాన్ ఇండియా స్థాయికి ఎద‌గాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి.

అయితే ఈ స్థాయి రావ‌డానికి ప‌లువురు తెలుగు సినిమా ప్ర‌ముఖుల‌ కృషి క‌లిసొచ్చింద‌ని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమాకి ఈ స్థాయిని క‌ట్ట‌బెట్టినవాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అన‌డంలో సందేహం లేదు. ఆర్కా మీడియా అండ‌దండ‌ల‌తో అత‌డు బాహుబ‌లి 1- బాహుబ‌లి 2 చిత్రాల‌ను తెర‌కెక్కించి ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా స‌త్తా ఏంటో చూపించాడు. బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత భార‌తీయ సినిమా ఎదుగుద‌ల‌ను ఇప్పుడు మ‌నం చూస్తున్నాం. రాజ‌మౌళితో పోటీప‌డుతూ ముందుకు దూసుకెళ్లాల‌న్న త‌ప‌న‌ను ఇత‌ర భాష‌ల‌ ఫిలింమేక‌ర్స్ లో చూస్తూనే ఉన్నాం.

ఇక రాజ‌మౌళితో పాటు ద‌గ్గుబాటి రానా గురించి మ‌నం చాలా విష‌యాల్ని తెలుసుకోవాల్సి ఉంది. టాలీవుడ్ అగ్ర‌నిర్మాత మూవీ మొఘ‌ల్ డా.డి.రామానాయుడు మ‌న‌వ‌డిగా ద‌గ్గుబాటి రానాకు సినిమా మార్కెట్ పై అసాధార‌ణ‌మైన గ్రిప్ ఉంది. అంతేకాదు.. అత‌డు త‌నకు ఉన్న అభిరుచి అపారమైన ప‌రిజ్ఞానం స‌త్సంబంధాల‌తో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నాడ‌న్న‌ది త‌క్కువ మందికే తెలిసిన స‌త్యం. రానా హీరో కం నిర్మాత‌గా బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో స‌త్సంబంధాల‌ను క‌లిగి ఉన్నాడు. తొలి నుంచి ఇత‌రుల్లా కాకుండా ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ ని పుల్ చేయ‌డానికి అత‌డు ప్ర‌య‌త్నించాడు. కెరీర్ ఆరంభంలోనే హిందీ మార్కెట్ కి ప‌రిచ‌య‌మయ్యేందుకు రానా చేసిన ప్ర‌య‌త్నాల‌ను గుర్తుకు తెచ్చుకోవాలి.

ఇప్పుడు అంత‌ర్జాతీయ ఈవెంట్ల‌లో వేదిక‌ల‌పైనా రానా తెలుగు సినిమాకి ముఖంగా మారాడు. చాలా అంత‌ర్జాతీయ సినిమా ఉత్సవాల నిర్వాహ‌ణ‌కు ద‌గ్గుబాటి రానా స‌హ‌క‌రిస్తున్నారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి విస్తరింపజేయడంలో రానా బలమైన స్తంభాలలో ఒకడిగా నిలుస్తున్నాడు. బాహుబ‌లి మొద‌లు ప్రాజెక్ట్ కే వ‌ర‌కూ అంత‌ర్జాతీయ ప్ర‌మోష‌న్ల‌లో అత‌డు ఒక ముఖంగా మారాడు.

ద‌గ్గుబాటి రానా ఒక యువ నిర్మాత హోదాలో మంచి కంటెంట్ ఉన్న సినిమాల‌కు స‌హ‌క‌రించేందుకు ఎప్పుడూ ముందుంటాడ‌న‌డంలో సందేహం లేదు. బాహుబలి త‌ర‌హాలోనే ఇప్పుడు ప్రాజెక్ట్ K చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని తీసుకురావడంలో రానా గొప్ప పాత్రను పోషించాడు. శాన్ డియాగో కామిక్-కాన్‌లో ప్రాజెక్ట్ K - కల్కి 2898 AD తాజా ఈవెంట్ సమన్వయంలో రానా ప్ర‌మేయం ఎంతో గొప్ప‌ద‌న‌డంలో సందేహం లేదు. కామిక్ కాన్ లో ప్రాజెక్ట్ కే ప్ర‌చారంలో రానా చాక‌చ‌క్యం ఎంత‌గానో వైజ‌యంతి బ్యాన‌ర్ కి క‌లిసొచ్చింది.

స్వ‌త‌హాగా సిగ్గ‌రి అయిన ప్ర‌భాస్ కి కూడా రానా పెద్ద అండ‌గా నిలిచారు. శాన్ డియాగో కామిక్-కాన్‌లో కల్కి 2898 AD గ్లింప్స్ ఈవెంట్ లో రానా సహజత్వంతో కూడుకున్న హోస్టింగుపైనా ప్ర‌శంస‌లు కురిసాయి. ప్రాజెక్ట్ K గురించి ప్రభాస్ పై ఒక‌ ప్రశ్న సంధించ‌గా.. ప్రభాస్ నిశ్చింతగా ఉండటానికి రానా సహాయం చేసాడు. అతను దానికి మంచి సమాధానం ఇస్తానని 'బాహు మాట్లాడకపోతే భల్లా చేస్తాడు' అని చెప్పినప్పుడు వీక్ష‌కుల్లో కేరింత‌లు చూశాం.

రానా ప్రతిష్టాత్మక కామిక్-కాన్‌లో వివిధ భాగస్వాములతో తన సినిమాని.. టీవీ .. కామిక్-బుక్ ప్రాజెక్ట్ లను కూడా ఆవిష్కరించాడు. అందులో 'హిరణ్యకశిప‌'ను స్పిరిట్ మీడియా అభివృద్ధి చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. అలాగే చాళుక్య రాజవంశం ఆధారంగా 'లార్డ్ ఆఫ్ ద డెక్కన్' మిన్నల్ మురళి సూపర్ హీరో కామిక్ ఆధారంగా రూపొందుతోంది. కేవ‌లం త‌న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌డ‌మే గాక త‌న స్నేహితులు ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌కు స‌హ‌కారం అందించేందుకు రానా ఎప్పుడూ ముందుంటాడు. నిజానికి తెలుగు సినిమా ఎదుగుద‌ల‌కు అత‌డు చేస్తున్న కృషిని అంద‌రూ గుర్తించి గౌర‌వించాల్సిన ప్ర‌త్యేక సంద‌ర్భ‌మిది. రానా ఒక హీరో మాత్ర‌మే కాదు.. నిర్మాత‌.. అభిరుచి స‌హ‌క‌రించే నైజం క‌లిగిన గొప్ప వ్య‌క్తిత్వం అన‌డంలో సందేహం లేదు.

Tags:    

Similar News