దర్శకుడితో ప్రేమలో తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టు
ప్రముఖ దర్శకుడితో పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ధృవీకరించడంతో సస్పెన్స్ వీడింది.
ప్రముఖ దర్శకుడితో పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ధృవీకరించడంతో సస్పెన్స్ వీడింది. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషలలో వంద పైగా సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన రవీనా రవి.. నయనతారతో సహా పలువురు ప్రముఖ నటీమణులకు కూడా డబ్బింగ్ అందించింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేయడంతో పాటు రవీనా కొన్ని హిట్ సినిమాల్లోను నటించారు.
లవ్ టుడే, మామన్నన్, ఒరు కిదయిన్ కరుణై మను వంటి చిత్రాలలో రవీనా రవి (30) పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. ఆమెకు ప్రశంసనీయమైన అభిమానులను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు రవీనా రవి మలయాళ దర్శకుడు దేవన్ జయకుమార్తో తన సంబంధాన్ని ధృవీకరించారు. సోషల్ మీడియాల ద్వారా ఈ విషయాన్ని రవీనా బహిర్గతం చేసారు. తన ప్రేమను ధృవీకరిస్తూ రవీనా రవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శకుడు దేవన్ జయకుమార్తో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసారు. ఈ ఫోటోగ్రాఫ్ కి ``నశ్వరమైన క్షణాల ప్రపంచంలో మేం శాశ్వతమైనదాన్ని కనుగొన్నాం.. కలిసి మేం మా కథను రాస్తాము`` అని అందమైన క్యాప్షన్ ని ఇచ్చారు. పెళ్లి తేదీ తెలుసుకునేందుకు తొందరపడే లోగానే, ఈ ప్రియమైన జంటకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దేవన్ జయకుమార్ మలయాళం చిత్రం `వాలాట్టి`కి దర్శకత్వం వహించారు. ఇది పూర్తిగా కుక్కల చుట్టూ నడిచే కథాంశంతో రూపొందింది. సినిమాలో అమలు అనే కుక్కకి రవీనా రవి డబ్బింగ్ వాయిస్ అందించి తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడం గమనార్హం. దర్శకుడు దేవన్ జయకుమార్, రవీనా రవి `వాలాట్టి` సినిమాకి పని చేసే సమయంలో ప్రేమ చిగురించిందని గుసగుస వినిపిస్తోంది.