పవన్ కి కౌంటర్ గానే పెప్సీ అధ్యక్షుడు స్పందించారా?
ఏపీమంత్రి రోజా భర్త..దక్షిణా భారత సినీ కార్మికులు సమాఖ్య( పెప్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఏపీమంత్రి రోజా భర్త..దక్షిణా భారత సినీ కార్మికులు సమాఖ్య( పెప్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేసారు. పాన్ ఇండియా మోజులో పడి తమ ఉనికిని కోల్పోతున్నామని అభిప్రాయ పడ్డారు. మరోసారి వివాదాస్పద స్థానికత అంశంపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. తమిళ సినిమాల్లో తమిళ నటులు..సాంకేతిక నిపుణులకే అవకాశాలు కల్పించాలన్నారు.
ఇతర పరిశ్రమల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నానని.. తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు రాదని మరోసారి స్పష్టం చేసారు. దీంతో మరోసారి దేశ వ్యాప్తంగా సెల్వమణి వ్యాఖ్యలపై ఆసక్తి సంతరించుకుంది. ఆయన చేసిన వ్యాఖ్యల్ని సౌత్ పరిశ్రమలు గతంలోనే ఖండించాయి. స్థానికతకే పెద్ద పీట వేయడం సరికాదని పలువురు నటులు..దర్శక-నిర్మాతలు అభిప్రాయపడ్డారు.
అలాగే 'బ్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. సినిమా అనేది వినోదం మాత్రమేనని..దాంట్లో ప్రాంతీయ బేధాలు చూడొద్దని ..బ్రో సినిమాని అన్ని భాషల నటులతో చేసామని అన్నారు. కళా కారుల్ని ఒక ప్రాంతానికి..మతానికి...కులానికి పరిమితం చేయోద్దని సూచించారు. పవన్ వ్యాఖ్యల్ని దృష్టిలో ఉంచుకుని ఆర్కే సెల్వమణి మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో సన్నివేశం పవన్ వర్సెస్ ఆర్కె సెల్వమణి అనేలా మారుతుందా? అన్న సందేహాలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయం ఎలా ఉందో తెలిసిందే. అధికార పక్షం-జనసేన అధినేత మధ్య తీవ్రమైన వాదాపోవాదనలు నడుస్తున్నాయి. మంత్రి రోజా-పవన్ మధ్య మాటల యుద్దం తాజాగా మళ్లీ ముసురుకుంది. ఈ నేపథ్యంలో ఆర్కె సెల్వమణి తాజా వ్యాఖ్యల వెనుక రాజకీయం ఉందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మరి ఆర్కే సెల్వమణి తాజా వివరణపై మిగతా పరిశ్రమల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.