సందీప్ వంగాను నిలదీయడమే ఉద్ధేశమా?
ఇప్పుడు ఓ రియాలిటీ షో లైవ్ కార్యక్రమంలో సందీప్ వంగాకు పాత ప్రశ్నలే కొత్తగా ఎదురయ్యాయి. ఇండియన్ ఐడల్ -15 లో ప్రత్యేక అతిథిగా హాజరైన అతడిని మానసి అనే కంటెస్టెంట్ ఇలా ప్రశ్నించింది.
కబీర్ సింగ్.. యానిమల్ లాంటి బంపర్ హిట్ చిత్రాలను బాలీవుడ్ కి అందించాడు సందీప్ రెడ్డి వంగా. ఇటీవలి కాలంలో భన్సాలీ, సిద్దార్థ్ ఆనంద్, రోహిత్ శెట్టి, రాజ్ కుమార్ హిరాణీ వంటి పేరున్న హిందీ దర్శకులు అందించలేనంత పెద్ద విజయాలను అతడు అందించాడు. పైన పేర్కొన్న ఆదర్శవంతమైన దర్శకులను అతడు మించిపోవడం కూడా సమస్యాత్మకంగా మారింది. నిజానికి సందీప్ రెడ్డి వంగాను చాలామంది టార్గెట్ చేయడానికి కారణం అతడు ఒక దక్షిణాదికి చెందినవాడు కావడమేనని విశ్లేషిస్తున్నారు.
సందీప్ వంగా రూపొందించిన కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలపై చాలా విమర్శలొచ్చాయి. అతడి సినిమాల్లో మగతనం డామినేషన్, హింసాత్మక ప్రవృత్తిని చాలామంది విమర్శించారు. ముఖ్యంగా నెటిజనులు ఏదో ఒక వంకతో సందీప్ వంగాపై విరుచుకుపడుతూనే ఉన్నారు. వేదికలపైనా అతడిని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. హిందీ చిత్రసీమలో కొందరు ప్రముఖులు మీడియా వేదికలుగా ప్రశ్నిస్తూ అతడిని అవమానించేందుకు కంకణం కట్టుకోవడం చూశాం.
ఇప్పుడు ఓ రియాలిటీ షో లైవ్ కార్యక్రమంలో సందీప్ వంగాకు పాత ప్రశ్నలే కొత్తగా ఎదురయ్యాయి. ఇండియన్ ఐడల్ -15 లో ప్రత్యేక అతిథిగా హాజరైన అతడిని మానసి అనే కంటెస్టెంట్ ఇలా ప్రశ్నించింది. యానిమల్, కబీర్ సింగ్ లో ఫలానా సీన్స్ తనకు నచ్చలేదని ఆమె అన్నారు. యానిమల్ లో 'మేరా జూటా చాటో' సీన్ సమాజానికి సమస్యాత్మకమని కూడా విమర్శించారు. దానికి వివరణ ఇవ్వాల్సిందిగా సందీప్ వంగాను మానస్వి కోరగా, అతడు స్పందిస్తూ సినిమాలో హీరో 300 మందిని చంపాడు.. అది సమస్య కాదా? అని ప్రశ్నించాడు. అలాగే కబీర్ సింగ్ లోను కథానాయకుడి హింసాత్మక ప్రవృత్తి, చెంప దెబ్బ కొట్టడం తనకు నచ్చలేదని సదరు కంటెస్టెంట్ నిలదీసారు.
లిరిసిస్ట్ జావేద్ అక్తర్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని కూడా ఆమె అంది. అయితే సందీప్ వంగాను ఇలాంటి ప్రశ్నలు అడగాల్సిందిగా 'ఇండియన్ ఐడల్' షో నిర్వాహకులు పట్టుబట్టి మరీ ఆమెను తీసుకుని వచ్చారా? ఏమో కానీ, టీఆర్పీల కోసం ఇక్కడ ఒక తెలుగు దర్శకుడిని అవమానించాలనే జిజ్ఞాస బయటపడింది. ఇక సందీప్ వంగా తనకు ఎదురైన ప్రశ్నలన్నిటికీ డీసెంట్ ఆన్సర్స్ ఇచ్చారు.
నిజానికి కమర్షియల్ సినిమా ఫార్మాట్ ఏంటో హిందీ దర్శకులు ఇప్పటికీ నేర్చుకోలేదని విమర్శలు ఉన్నాయి. పొరుగు నుంచి వచ్చిన సందీప్ వంగా లేదా ఇతర దక్షిణాది దర్శకుల నుంచి హిందీ ఫిలింమేకర్స్ నేర్చుకోవాలని బాలీవుడ్ విమర్శకులు, విశ్లేషకులే సూచిస్తున్నారు. కరణ్ జోహార్, తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు దక్షిణాది ఫిలింమేకింగ్, ప్రమోషనల్ స్ట్రాటజీలను తమవారు నేర్చుకోవాలని సూచించారు. ఇలాంటి సమయంలో ఇంకా సందీప్ వంగాను నిలదీసే కార్యక్రమాలు ఎవరినుద్ధరించేందుకు? అని కూడా తెలుగు అభిమానులు సీరియస్ అవుతున్నారు. అతడు మునుముందు కబీర్ సింగ్ 2, యానిమల్ 2 తీస్తాడు. వాటిలోను హింసాత్మక ప్రవృత్తి ఉంటుంది. మళ్లీ ఆ సినిమాలు 1000 కోట్లు వసూలు చేస్తాయి. ప్రజలు సినిమాల నుంచి మంచిని గ్రహించి చెడును వదిలేయగల సమర్థులు.. కమర్షియల్ సినిమాకి హద్దులు నిర్ధేశించడం అనేది కేవలం కొందరి అభిమతం. అది మొత్తం ప్రజలకు ఆపాదించకూడదు.
సందీప్ వంగా పని తీరుపై రెడ్డిటర్ల విశ్లేషణ :
ఒక రెడ్డిటర్ ప్రకారం.. జావేద్ అక్తర్ విమర్శలకు సమాధానమివ్వడానికి ఛానెల్ .. షో రన్నర్లు .. స్వయంగా స్క్రిప్టు చేసిన వాస్తవం కూడా అంతే మనసుకు హత్తుకునేలా ఉంది! అని ఒకరు ఇండియన్ ఐడల్ నిర్వాహకులను విమర్శించారు.
Lol ఇదంతా స్క్రిప్ట్! బాలీవుడ్‌లో కెరీర్‌ను సంపాదించాలనుకునే ఈ పోటీదారులు, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడైన షో అతిథిని స్వయంగా ప్రశ్నించరు. వారు రాసిచ్చిన స్క్రిప్టు ప్రకారం ప్రశ్నిస్తారని ఒకరు అభిప్రాయపడ్డారు.
సందీప్ వంగా కేవలం తన చుట్టూ లేదా తన సినిమా చుట్టూ వివాదాలను సృష్టించాలనుకుంటున్నాడు. అతడు అందరూ తననే చూడాలని కోరుకుంటాడు. వీలైనంత వరకు లైమ్‌లైట్‌లో ఉండాలని భావిస్తాడు.. అని ఒకరు విశ్లేషించారు.
కొందరు మాత్రం అతడు స్త్రీలను కించపరిచే విధానం మార్చుకోవాలని సూచించారు.