పవన్ మూవీ టైటిల్‌ను అందుకే పెట్టాం
ప్రదీప్ హీరోగా దీపికా పిల్లి హీరోయిన్ గా నటించిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.;

ఆర్జేగా కెరీర్ ను స్టార్ట్ చేసి తర్వాత బుల్లితెర యాంకర్ గా మారిన ప్రదీప్ కు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ప్రదీప్ యాంకరింగ్ కు చిన్న నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ ఫిదా అయ్యారు. అతని క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఏకంగా పెళ్లి చూపులు అనే రియాలిటీ షో చేశారంటే ప్రదీప్ ఫాలోయింగ్ ను అర్థం చేసుకోవచ్చు. ఆ క్రేజ్ ను చూసుకునే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ప్రదీప్ హీరోగా మారాడు. 2021లో ఆ సినిమా రిలీజైంది. ఆ సినిమా తర్వాత ప్రదీప్ మళ్లీ సినిమాల జోలికి రాకుండా యాంకర్ గానే కొనసాగాడు. ఇప్పుడు మళ్లీ ప్రదీప్ తన రెండో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యాడు.
ప్రదీప్ హీరోగా దీపికా పిల్లి హీరోయిన్ గా నటించిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ భరత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆల్రెడీ రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటూ సినిమాపై అంచనాలను కూడా పెంచుకుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై ప్రదీప్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు.
మూవీ రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న ప్రదీప్ కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చాడు. ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమాగా వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ పెట్టడం వల్ల ఫ్యాన్స్ నుంచి ప్రతికూల స్పందన వచ్చే అవకాశముందని అనుకున్నామని, అయితే ముందు నుంచి తాము ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ పెట్టాలనుకోలేదని ప్రదీప్ స్పష్టం చేశాడు.
కథ డిమాండ్ చేయడం వల్లే ఆ టైటిల్ ను పెట్టాం తప్పించి పవన్ కళ్యాణ్ టైటిల్ ను పట్టుబట్టి మరీ కావాలని పెట్టలేదని, సినిమా చూశాక అందరికీ ఆ విషయం అర్థం అవుతుందని, పవన్ కళ్యాణ్ సినిమాకు ఉన్న గౌరవాన్ని, లెగసీని తాము కాపాడతామని, తమ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకముందని ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపాడు. ఈ సినిమా అయినా ప్రదీప్ కు తను అనుకున్న స్టార్‌డమ్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.