మైత్రితో మరో బాలీవుడ్ హీరో.. ఈసారి దర్శకుడు ఎవరంటే?

పాన్ ఇండియా స్థాయిలో తెలుగుసినిమాల ప్రాధాన్యం పెరుగుతున్న వేళ, టాలీవుడ్ నిర్మాతలు బాలీవుడ్‌లో తమ పరిధిని విస్తరించేందుకు ముందడుగు వేస్తున్నారు.;

Update: 2025-04-07 14:29 GMT
Director Bobby With Hrithik Roshan

పాన్ ఇండియా స్థాయిలో తెలుగుసినిమాల ప్రాధాన్యం పెరుగుతున్న వేళ, టాలీవుడ్ నిర్మాతలు బాలీవుడ్‌లో తమ పరిధిని విస్తరించేందుకు ముందడుగు వేస్తున్నారు. ఈ జాబితాలో ముందుండే సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'జాట్' అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మైత్రి, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తోంది. మరి ఆ ప్రాజెక్ట్‌కి డైరెక్టర్ ఎవరు? హీరో ఎవరు? అన్న ప్రశ్నలకు ఇప్పుడు ఒక్కొక్కటిగా సమాధానాలు బయటకు వస్తున్నాయి.

మైత్రి సంస్థ తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తూ.. బాలీవుడ్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. పుష్ప 2 వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత, బిగ్ బ్యానర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రభాస్ తో హను రాఘవపూడి దర్శకత్వంలో హై బడ్జెట్ మూవీని నిర్మిస్తోంది. ఇక ‘జాట్’ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఫుట్‌ప్రింట్ వేసిన మైత్రి, ఇప్పుడు మరో మెట్టు ఎక్కేందుకు రెడీ అవుతోంది.

ఈసారి గోపీచంద్ మలినేని కాకుండా మరో మాస్ మాస్ డైరెక్టర్‌ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుతున్న సమాచారం మేరకు, మైత్రి మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తోంది. ఈసారి కథ, దర్శకత్వ బాధ్యతలు బాబీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మాస్ డైరెక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బాబీ.. ఇటీవల ‘డాకు మహారాజ్’ తో డీసెంట్ సక్సెస్ చూశాడు. ఇక అతను బాలీవుడ్ హీరోలను కలుస్తున్నట్లు టాక్. ముఖ్యంగా బాబీ హృతిక్ రోషన్‌ను కలిసి ఓ మాస్ యాక్షన్ స్టోరీ లైన్ చెప్పాడట.

హృతిక్ కథ వినగానే ఆసక్తిగా స్పందించినట్టు సమాచారం. ప్రాథమికంగా ఓకే కూడా చెప్పాడట. అయితే పూర్తిగా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైతే ఫైనల్ కమిట్మెంట్ ఇవ్వనున్నాడు. ఒకవేళ అన్ని కుదిరితే.. బాబీ - హృతిక్ కాంబినేషన్‌తో మైత్రి ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను బాలీవుడ్‌కి అందించబోతోంది. టెక్నికల్‌గా అగ్రశ్రేణి బృందంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని మైత్రి భావిస్తోంది. ఈ కాంబినేషన్ పాన్ ఇండియా స్థాయిలో ఊహించని స్థాయిలో బజ్ క్రియేట్ చేయగలదని ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయపడుతున్నాయి.

కథల పటిమ, మాస్ అండ్ ఎమోషనల్ కమర్షియల్ టచ్‌లకు డిమాండ్ పెరిగినందున, టాలీవుడ్ దర్శకులపై బాలీవుడ్ నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ వారికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా బాలీవుడ్ హీరోలను తెలుగు దర్శకులను కలిపేస్తూ కొత్త తరహా సినిమాలను నిర్మిస్తున్నారు. మొత్తానికి మైత్రి బ్యానర్ ఇప్పుడు బాలీవుడ్‌లో తాము నమ్మిన డైరెక్టర్లను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఈ కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News