'సంక్రాంతికి వస్తున్నాం' వరల్డ్ ప్రీమియర్ డేట్ ఫిక్స్
ముందుగా జీ తెలుగు ఛానల్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని కొన్ని రోజుల ముందే అధికారికంగా జీ తెలుగు ప్రకటించింది.
వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గత నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం తెలుగులో మాత్రమే విడుదల అయినా కూడా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు దక్కాయి. తెలుగు సినీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక లాభాలను తెచ్చి పెట్టిన రీజినల్ మూవీగా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాకుండా వంద కోట్లకు మించి షేర్ రాబట్టిన సినిమాగా కూడా ఈ సినిమా నిలిచిన విషయం తెల్సిందే. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయి నాలుగు వారాలు దాటింది.
సాధారణంగా ఈమధ్య కాలంలో అన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో, రెండు మూడు నెలల తర్వాత టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం ఓటీటీ కంటే టెలివిజన్‌లో ప్రీమియర్ కాబోతుంది. ముందుగా జీ తెలుగు ఛానల్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని కొన్ని రోజుల ముందే అధికారికంగా జీ తెలుగు ప్రకటించింది. తాజాగా మార్చి 1న ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. జీ తెలుగు లో టెలికాస్ట్ కాబోతున్న ఈ సినిమాకు అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఒకప్పుడు థియేటర్ నుంచి డైరెక్ట్ టీవీల్లో వచ్చేది. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత టీవీల్లో రావడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను డైరెక్ట్ టీవీల్లో ప్రసారం చేయడం అనేది సరికొత్త ప్రయోగంగా చెప్పుకోవచ్చు. టీవీల్లో పెద్ద హీరోల సినిమాలను సైతం జనాలు పెద్దగా చూడటం లేదు. ఓటీటీలో దాదాపు అందరూ చూసిన తర్వాత టీవీల్లో చూడ్డానికి జనాలు మిగలడం లేదు. అందుకే టీవీ టెలికాస్ట్ రేటింగ్ దారుణంగా పడిపోతున్నాయి. కల్కి సినిమాకు ఇటీవల నమోదు అయిన తక్కువ రేటింగ్ చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే.
మార్చి 1వ తారీకు సాయంత్రం 6 గంటలకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జీ తెలుగులో టెలికాస్ట్ చేయబోతున్నారు. గత 5 ఏళ్లలో ఏ తెలుగు సినిమాకు దక్కని టీఆర్‌పీ రేటింగ్ ఈ సినిమాకు దక్కబోతుంది అనే నమ్మకంను జీ తెలుగు ఛానల్ వారు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాలేదు. కనుక అత్యధికంగా జనాలు, ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు టీవీల ముందు కూర్చునే అవకాశాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో 2027 సంక్రాంతికి మరోసారి ఈ సినిమా సీక్వెల్‌తో రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే.