సంక్రాంతికి బరిలో తమిళ్ సినిమా.. అవసరమా?
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది. 2024 సంక్రాంతి బరిలో ఐదు సినిమాల నిలవగా అందులో నిర్మాతలు కూలంకషంగా చర్చించి రవితేజ 'ఈగల్' సినిమాని సంక్రాంతి బరి నుంచి తప్పించారు. దాంతో ప్రస్తుతం సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ, నా సామిరంగ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఈ నాలుగు సినిమాలకే థియేటర్స్ దొరకడం కష్టమంటే ఇప్పుడు ఈ మధ్యలో ఓ తమిళ సినిమా కూడా వచ్చి చేరింది. నిజానికి ప్రతి ఏడాది తెలుగు సినిమాలతో పాటు ఒకటి, రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా గత ఏడాది చూసుకుంటే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి మధ్యలో కోలీవుడ్ హీరో విజయ్ నటించిన 'వారసుడు' రిలీజ్ అయింది. ఈసారి పొంగల్ బరిలో తమిళంలో నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి.
మామూలుగా తమిళ్ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంటుంది కాబట్టి డబ్బింగ్ చేసి తెలుగులో ఒకేసారి రిలీజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికే అయలాన్ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ సంక్రాంతికి తెలుగులో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ఉద్దేశంతో ధనుష్ పొంగల్ బరి నుంచి తప్పుకున్నాడు.
కానీ శివ కార్తికేయన్ 'అయలాన్' మాత్రం సంక్రాంతికి అంటే జనవరి 12కి తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తెలుగు సినిమాలకే థియేటర్స్ దొరకడం కష్టమైపోయింది. ఉన్న థియేటర్స్ లో చాలా వరకు 'గుంటూరు కారం' ఆక్యుపై చేసేసింది. మిగిలిన కొన్ని థియేటర్స్ ఇతర సినిమాలకు కేటాయించారని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు పై సోషల్ మీడియా అంతటఅభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్స్ కేటాయించుకుని, హనుమాన్ సినిమాకి అడిగినా కూడా థియేటర్స్ ఇవ్వలేదని పలువురు అసహనం వ్యక్తం చేశారు.
తెలుగు సినిమా అయిన హనుమాన్ కి థియేటర్స్ ఇవ్వకుండా తమిళ్ సినిమా ఆయన 'అయలాన్' ని దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన సినీ జనాలు, నెటిజన్స్ దిల్ రాజును తీవ్రంగా విమర్శిస్తున్నారు. సంక్రాంతికి తెలుగులోనే చాలా సినిమాలు ఉంటే వాటికి థియేటర్స్ ఇవ్వకుండా ఓ డబ్బింగ్ సినిమాను తెచ్చుకోవడం ఏంటంటూ? దిల్ రాజు పై ప్రశ్నలు సందిస్తున్నారు.