2023 కొనసాగింపు కలిసొచ్చిందే!
సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పొలిమేర' చిత్రానికి కొనసాగింపుగా 'పొలిమేర2' ఈ ఏడాది రిలీజ్ అయిన సంగతి తెలిసిందే
హిట్ సినిమాలకు సీక్వెల్స్..కొనసాగింపు కథలు..ఒకే కథని రెండు భాగాలుగా చెప్పడం వంటివి టాలీవుడ్ లో కూడా జోరందుకుంటోన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈ రకమైన కల్చర్ బాలీవుడ్ లోనూ ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ వేగం పుంజుకున్నట్లు కనిపిస్తుంది. వరుసగా సీక్వెల్స్...కంటున్యూటీ కథల్ని తెరపైకి తెస్తున్నారు. మరి ఈ ఏడాది అలా రిలీజ్ అయిన సినిమాలు ఎలాంటి ఫలితాలు సాధించాయో ఓసారి చూద్దాం.
సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పొలిమేర' చిత్రానికి కొనసాగింపుగా 'పొలిమేర2' ఈ ఏడాది రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం ఓటీటీలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. దీంతో రెండవ భాగాన్నీ భారీ ఎత్తున తెరకెక్కించి నేరుగా థియేటర్లోనే రిలీజ్ చేసారు. ఈ సినిమా మంచి వసూళ్లని సాధించింది. చిన్న సినిమాల్లో పెద్ద విజయంగా నిలిచింది. దీంతో పొలిమేర3 కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' రెండవ భాగాన్ని వేసవిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొదటి భాగానికి కంటున్యూటీగా రిలీజ్ అయిన రెండవ భాగం పెద్ద విజయం సాధించింది. ఇక విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడి'ని కొనసాగిస్తూ 'బిచ్చగాడు -2' కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమా తమిళ్ లో కంటే తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. అన్నా-చెల్లి సెంటిమెంట్ తెలుగు ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. దీంతో ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా 'బిచ్చగాడి 3'ని కూడా తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇక రాఘవ లారెన్స్ నటించిన 'చంద్రముఖి-2' భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసినా ఫలితం మాత్రం నిరాశపరిచింది. చంద్రముఖి ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవ్వడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నా ఫలితం మాత్రం ఉసురుమనిపించింది. అయితే లారెన్స్ నటించిన రెండవ సీక్వెల్ 'జిగరత్తాండ డబుల్ ఎక్స్ ఎల్' మాత్రం కోలీవుడ్ లో మంచి విజయం సాధించింది. అలాగే కనడ స్టార్ రక్షిత్ నటించిన 'సప్తసాగరాలు సైడ్ ఏ'..'సప్తసాగరాలు సైడ్ బీ' చిత్రాల్ని ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేసి విజయం సొంతం చేసుకున్నాడు. ఈ రెండు విజయాలు రక్షిత్ కి తెలుగులో మంచి పేరు తీసుకొచ్చాయి.