షారూఖ్ పొరుగింటి గృహిణి ర‌కుల్ ప్రీత్

అలాంటి అరుదైన చోటు నుంచి ఖాన్ వెళ్లిపోతున్నాడ‌ని తెలియ‌గానే చాలామంది అభిమానులు భావోద్వేగానికి గుర‌య్యారు.;

Update: 2025-03-18 04:00 GMT

షారుఖ్ ఖాన్ అతడి కుటుంబ స‌భ్యులు ప్ర‌స్తుతం నివాసం ఉంటున్న `మ‌న్న‌త్` ఇంటిని వ‌దిలి వెళ్లిపోతున్నారంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం జరుగుతోంది. ముంబై బాంద్రాలోని ఈ ఐకానిక్ బిల్డింగ్ ని అభిమానులు, టూరిస్టులు విధిగా సంద‌ర్శించి త‌మ ఫేవరెట్ స్టార్ అభివాదాన్ని స్వీక‌రించి, ఆనందం నిండిన హృద‌యాల‌తో త‌మ ఇండ్ల‌కు వెళుతుంటారు. అలాంటి అరుదైన చోటు నుంచి ఖాన్ వెళ్లిపోతున్నాడ‌ని తెలియ‌గానే చాలామంది అభిమానులు భావోద్వేగానికి గుర‌య్యారు.

అయితే ఇది తాత్కాలిక ప్ర‌యాణ‌మే. బాంద్రా ఇల్లు `మన్నత్` నుండి ఖాన్ వేరొక చోటికి నివాసం ఉండ‌టానికి వెళుతున్నార‌న్న‌ది నిజం. దీంతో 20 సంవత్సరాలకు పైగా అక్కడ నివసించిన వారు ఎక్క‌డికి వెళుతున్నారు? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. మ‌న్న‌త్ కి మే నెలలో రిపెయిర్లు చేస్తున్నారు. మన్నత్ ఒక వారసత్వ భవనం కాబట్టి షారుఖ్ ఖాన్ కు ఈ మార్పులకు చట్టపరమైన అనుమతులు అవసరం. పునరుద్ధరణకు దాదాపు మూడు సంవత్సరాలు పడుతుంద‌ని తెలుస్తోంది.

అయితే మ‌న్న‌త్ ని విడిచిపెట్టాక షారూఖ్, అత‌డి భార్య‌ గౌరీఖాన్, వారి పిల్ల‌లు ఆర్య‌న్ ఎబి రామ్ ఎక్క‌డ నివ‌శిస్తారు? అంటే.....ఖాన్ తో క‌లిసి బాంద్రాలోని `పూజా కాసా` అనే విలాసవంతమైన అపార్ట్‌మెంట్ లో నివ‌శిస్తార‌ని తెలుస్తోంది. ఈ భవనం ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత‌ వాషు భగ్నాని, అతడి కుటుంబానికి చెందిన‌ది. ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న భ‌ర్త జాకీ భ‌గ్నానీతో క‌లిసి ఇదే భవంతిలో నివ‌శిస్తోంది. షారుఖ్ ఈ భవనంలో రెండు డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లను అద్దెకు తీసుకున్నాడు. నాలుగు అంతస్తుల్లో విస్తరించిన ఈ ఇంటిలో మొదటి, రెండవ అంత‌స్తులు, ఏడవ, ఎనిమిదవ అంత‌స్తులలో వారి కుటుంబ స‌భ్యులు నివ‌శిస్తారు. మన్నత్ రెనోవేష‌న్ సమయంలో ఖాన్ త‌న కుటుంబానికి భద్రత, గోప్య‌త కావాల‌నుకున్నారు. అందుకే ఈ అపార్ట్‌మెంట్‌లను మూడు సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నారు. దీనిని బ‌ట్టి ర‌కుల్ ప్రీత్ సింగ్ ఆమె కుటుంబం ఖాన్ కి పొరుగువారిగా నివ‌శించాల్సి ఉంటుంది. ఖాన్ కుటుంబం ఈ కొత్త ప్లేస్ తో ఎలా మింగిల్ అవుతుందో వేచి చూడాలి.

ఇక మ‌న్న‌త్ రెనోవేష‌న్ కోసం ఖాన్ ఎంత బ‌డ్జెట్ పెడుతున్నారు? భ‌వంతిలో మార్పులు ఏమిటి? అన్న‌దానిపై ఇంకా వివ‌రాలేవీ లేవు. అత‌డు త‌న భ‌వంతిని స్కై ట‌వర్ లా భారీగా విస్త‌రించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని, అయితే మున్సిప‌ల్ అనుమ‌తులు రావ‌డం అంత సులువు కాద‌ని కూడా మీడియాలో కొన్ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ప్ర‌స్తుతానికి మార్పుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ మూడేళ్ల‌లో మ‌న్న‌త్ ను ఖాన్ అభిమానులు సంద‌ర్శించే వీలు లేదు. రెనోవేష‌న్ పూర్త‌య్యేవ‌ర‌కూ ఇది తాత్కాలిక‌ ఎడ‌బాటు. షారూఖ్ త‌దుప‌రి కింగ్ చిత్రంలో త‌న కుమార్తె సుహానాతో పాటు న‌టిస్తున్నాడు. ప‌ఠాన్ 2 లోను న‌టించాల్సి ఉంది.

Tags:    

Similar News