ఆ స్టార్ హీరో ఫ్యామిలీ సపోర్ట్ కూడా జనసేనకే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలంతా ఒక ఎత్తు అయితే.. తూ.గో జిల్లా పిఠాపురం ఎన్నిక మరో ఎత్తు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలంతా ఒక ఎత్తు అయితే.. తూ.గో జిల్లా పిఠాపురం ఎన్నిక మరో ఎత్తు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. అందుకు కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అందరి దృష్టి అక్కడే ఉంది. పవన్ కోసం మెగా ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగింది.
ఇప్పటికే మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ పవన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. రోడ్ షోల్లో పాల్గొన్నారు. పవన్ ను గెలిపించాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. పిఠాపురంలో పవన్ కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించిన చరణ్.. నేడు పిఠాపురం వెళ్లారు. పవన్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.
తాజాగా దివంగత నటుడు కృష్ణంరాజు భార్య, హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా పవన్ కు మద్దతు తెలిపారు. పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవనున్నారని జోస్యం చెప్పారు. జనసేనాని విజయం ఖాయమైందని తెలిపారు. పిఠాపురం నుంచి చాలా మంది ఫోన్ చేసి.. పవన్ కళ్యాణ్ గెలుస్తారని తనకు చెబుతున్నట్లు శ్యామల దేవి వెల్లడించారు. పిఠాపురం ఓటర్లు పవన్ కు భారీ మెజార్టీ ఇస్తారని తెలిపారు.
ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో పిఠాపురానిదే హైయెస్ట్ మెజార్టీ అని తెలిపారు ప్రభాస్ పెద్దమ్మ. పవన్ కు ఆ మెజార్టీ కచ్చితంగా వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జై మోడీ, జై తెలుగుదేశం, జై జనసేన అంటూ ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే శ్యామల దేవి.. నరసాపురంలో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు పవన్ విజయం ఖాయమైందని చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.
అయితే పవన్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ తోపాటు ఎందరో సెలబ్రిటీలు నిలిచారు. జబర్దస్త్ ఆర్టిస్టులు హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ సహా పలువురు పవన్ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. నిర్మాతలు నాగవంశీ, ఎస్కేఎన్ ఇంటింటికి వెళ్లి మరీ పవన్ ను గెలిపించాలని కోరారు. హీరోలు నాని, తేజ సజ్జా, రాజ్ తరుణ్ తదితరులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి పవన్ ఎంతటి మెజార్టీతో విజయం సాధిస్తారో చూడాలి.