మ‌న‌కంటే అక్క‌డ ఇంకా దారుణ‌మా?

స‌మ్మ‌ర్ లో థియేట‌ర్లు రిలీజ్ లు లేక వెల‌వెల బోయిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-05-29 09:30 GMT

స‌మ్మ‌ర్ లో థియేట‌ర్లు రిలీజ్ లు లేక వెల‌వెల బోయిన సంగ‌తి తెలిసిందే. చివ‌రికి క‌రెంట్ బిల్లు కూడా రాద‌ని భావించిన థియేట‌ర్ యాజ‌మాన్యాలు స్వ‌చ్ఛందంగా థియేట‌ర్లను మూసివేసారు. తెలంగాణ‌తో పాటు ఏపీ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లలో ఈ స‌న్నివేశం కనిపించింది. కొన్ని చోట్ల మ‌ల్టీప్లెక్స్ లు కూడా మూత‌ప‌డ్డాయి. ఉంటే ఇంగ్లీష్ సినిమాలు వేసుకోవ‌డం లేదంటే? మూసుకోవ‌డం అన్న‌ట్లే క‌నిపించింది ఏపీ-తెలంగాణ‌లో. అయితే ఇక్క‌డ ఈ ర‌క‌మైన స‌న్నివేశం గ‌త వారం నుంచి మొద‌లైంది.

కానీ టాలీవుడ్ క‌న్నా దారుణంగా ఉంది కోలీవుడ్ లో ప‌రిస్థితి. అవును అక్క‌డ అస‌లు క‌నీసం చిన్న సినిమాలు కూడా లేక‌పోవ‌డంతో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు పూర్తిగా మూత వేసిన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పొంగ‌ల్ కానుక‌గా కోలీవుడ్ లో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. స్టార్ హీరోలు కాబ‌ట్టి బ‌ల‌వంత మీద ఆడించారు త‌ప్ప‌! న‌ష్టాలే వ‌చ్చాయి. సంక్రాంతి త‌ర్వాత స‌న్నివేశం పూర్తిగా మారిపోయింది. రీ-రిలీజ్ లు ఉండ‌టంతో కొన్ని థియేట‌ర్లుకు అవ‌కాశం ద‌క్కింది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి కూడా లేదు. ఎండ‌లు ముదిరాయి..రిలీజ్ లు లేవు.

దీంతో చూసి చూసి విసుగొచ్చిన త‌మిళ‌నాడు ఎగ్జిబిట‌ర్లు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌ను పూర్తిగా మూసేసారు. ఈ మూత ఇంకా ఈనెల రోజులు కూడా క‌నిపించే అవ‌కాశం ఉంది. జూన్ లో కొన్ని రి-రిలీజ్ లు ఉన్నాయి. వాటి కోసం కొన్ని థియేట‌ర్లు తీసే అవ‌కాశం ఉంది. మ‌ళ్లీ జూన్ 12వ‌ర‌కూ పెద్ద సినిమా రిలీజ్ లేదు. ఆ రోజున మాత్రం ఇండియ‌న్-2 రిలీజ్ అవుతుంది. ఆ వేవ్ కూడా వారం-ప‌దిరోజులే ఉంటుంది. ఈ మ‌ధ్య‌లో గానీ.. ఆత‌ర్వాత గానీ ఎలాంటి రిలీజ్ లు లేవు.

ర‌జనీకాంత్..క‌మ‌ల్ హాస‌న్ సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. విజ‌య్ సినిమా `గ్రేట్` షూటింగ్ పూర్త‌యినా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో ఉంది. త‌ల అజిత్ సినిమాల ప‌రిస్థితి దాదాపు అలాగే ఉంది. `తంగ‌లాన్` లాంటి సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నా రిలీజ్ పై జాప్యం కొన‌సాగుతుంది. ఇవ‌న్నీ క్లియ‌ర్ అయితే త‌ప్ప మ‌ళ్లీ కోలీవుడ్ లో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌టం క‌నిపించ‌దు. అంతవ‌ర‌కూ ప్రేక్ష‌కులు ఓటీటీల‌కు బాండ్ అవ్వాల్సిందే.

Tags:    

Similar News