మళ్ళీ 15 ఏళ్ళకు తెలుగు దర్శకుడితో సూర్య
తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉన్న హీరో. ఎలాంటి సినిమా చేసినా కూడా డబ్బింగ్ రూపంలో తెలుగులో మంచి ఆదరణ పొందాయి.
తమిళ స్టార్ హీరో సూర్య ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉన్న హీరో. ఎలాంటి సినిమా చేసినా కూడా డబ్బింగ్ రూపంలో తెలుగులో మంచి ఆదరణ పొందాయి. ఇక సూర్య చాలా కాలంగా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని చూస్తున్నాడు. తెలుగు దర్శకులు కూడా అతనితో సినిమా చేయాలని చాలా సార్లు కలిశారు.
మధ్యలో బోయపాటి, త్రివిక్రమ్ లాంటి వారితో చర్చలు జరిపినప్పటికి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక బాహుబలిలో రాజమౌళి కట్టప్ప కోసం అడగ్గా ఒప్పుకోలేదు. కానీ సూర్య ఇప్పటి వరకు కేవలం ఒక్క స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ మాత్రమే చేశాడు. అది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర 2 (2010). దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఓ డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్ కోసం సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈసారి సూర్య తెలుగులో సినిమా చేయబోయేది యువ దర్శకుడు వెంకీ అట్లూరితో. వెంకీ ఇటీవల లక్కీ భాస్కర్ వంటి భారీ హిట్ అందుకుని, తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అంతకుముందు ధనుష్‌తో చేసిన సార్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. వరుస బ్లాక్‌బస్టర్లతో మంచి ఫామ్‌లో ఉన్న వెంకీ అట్లూరి, ఇప్పుడు సూర్యతో స్ట్రైట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నారు.
మే నెల నుంచి షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే, సూర్య ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ రెట్రో యాక్షన్ సినిమా చేస్తున్నాడు. అదీ ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. అలాగే, వెట్రిమారన్ దర్శకత్వంలో వడివాసల్ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది. వీటికి తోడు, మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి.
తండేల్ మూవీతో హిట్ కొట్టిన చందూ మొండేటి ఇటీవల సూర్యకు ఓ హిస్టారికల్ కథ వినిపించినట్లు సమాచారం. 300 ఏళ్ల క్రితం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఇది తెరకెక్కే అవకాశం ఉంది. సూర్య సినిమాల జోరు చూస్తుంటే, తెలుగులోనూ త్వరలో తన మార్కెట్ మరింత పెంచుకునేలా కనిపిస్తున్నాడు. వెంకీ అట్లూరితో చేసే సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు బిగ్ సక్సెస్ అవుతున్నాయన్న విషయం తెలిసిందే. అందుకే సూర్య ఈ కాంబినేషన్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సూర్య మరోవైపు కొత్త కథల్ని వినిపించుకుంటూ మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని టాక్. తెలుగులో మరో సినిమా చేయాలని చూస్తున్న సూర్య, చందూ మొండేటితో చేసే ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ ఇవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.