టాలీవుడ్ చర్చ అంతా అతని గెలుపు కోసమేనా?
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒక ఎత్తైతే..పిఠాపురం ఎన్నిక మరో ఎత్తులా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒక ఎత్తైతే..పిఠాపురం ఎన్నిక మరో ఎత్తులా మారింది. అక్కడ గెలుపు గీతదా? పవన్ దా? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోట్లాది మంది ప్రజలు గెలుపు గుర్రం ఎక్కేది ఎవరంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్టీల పరంగా చూస్తే గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మరి టాలీవుడ్ మాటేంటి? అంటే అక్కడా ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. చిన్న చిన్న ఆర్టిస్టుల నుంచి అగ్ర స్థాయి నటుల వరకూ.. దర్శక-నిర్మాతలు, టెక్నిషియన్లు ఇలా అంతా పిఠాపురంలో జయకేతనం ఎగరేసేది? ఎవరంటూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ లు కూడా లేకపోవడంతో టాలీవుడ్ అంతా పిఠాపురం రాజకీయంతో నిండిపోయింది.
ఇప్పుడే సినిమా ఆఫీస్ లో చూసినా ఇదే టాపిక్ రసవత్తరంగా మారింది. ఇండస్ట్రీలో బేసిక్ గా పవన్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అతనిదే గెలుపని భావిస్తుండగా అదే సామాజిక వర్గం నుంచి బరిలో ఉన్నవంగా గీత బలహీన వర్గాల్లో బలంగా ఉన్నారని...కాపు కమ్యునిటీ నుంచి ఆమెకి ఓటు శాతం పెరుగుతుందనే డిస్కషన్స్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల స్ట్రాటజీ విషయంలో పవన్ కళ్యాణ్ లో వచ్చిన మార్పుల్ని కూడా అంతే సునిశితంగా పరిశీలిస్తున్నారు.
కూటమి సంగతి పక్కనబెడితే! 2019 ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో పవన్ ఎలా ఉండేవారు? ఇప్పుడెలాంటి స్ట్రాటజీతో పోటీలో దిగుతున్నారు? ఈ మధ్య కాలంలో పవన్ లో వచ్చిన మార్పులు..ఆయన స్పీచ్ లపై వాడి వేడి చర్చ సాగుతోంది. అలాగే వంగా గీత సైలెంట్ రాజకీయం వెనుక వ్యూహం ఏంటి? అన్నది ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తుంది. అయితే ఇండస్ట్రీ నుంచి మెజార్టీ వర్గం పవన్ గెలవాలి అని బలంగా కోరుకుంటున్నారన్నది వాస్తవం.
ఇప్పటికే పవన్ కోసం దాదాపు మెగా ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్..వదినమ్మ సురేఖ కూడా పవన్ తరుపున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. వీళ్లందరికంటే ముందుగా జబర్దస్త్ కమెడియన్లు...సీరియల్ ఆర్టిస్టులు కూడా పవన్ కం కూటమి తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. వీళ్లెవ్వర్ని పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం పిలవలేదు. అంతా స్వచ్ఛదంగా అభిమానంతో వచ్చి ప్రచారం చేసిన వారే.