యానిమల్.. మూగ వాడినే విలన్‌ని ఎందుకు చేసాడు?
సినిమాలో కనిపించేది పరిమిత సన్నివేశాల్లోనే అయినా కానీ బాబి డియోల్ అబ్రార్ పాత్రను పరాకాష్టకు చేర్చాడు;
కాప్ 'సింగం' పౌరుషంగా పంచ్ డైలాగులు చెబుతాడు. సింహం కంటి చూపుతో చంపేస్తానని డైలాగ్ అయినా చెప్పగలడు. కానీ ఎలాంటి డైలాగ్ తో పని లేకుండా హీరో- విలన్ ఢీకొట్టడమెలా? డైలాగులతో పనే లేకుండా కేవలం హావభావాల ద్వారా మాత్రమే సన్నివేశాలను పండించడమెలా? ఇది సాధించి చూపించాడు కాబట్టే సందీప్ రెడ్డి వంగా చాలా ప్రత్యేకమైన దర్శకుడు అయ్యాడు.
యానిమల్ సినిమాలో విలన్ అబ్రార్ పాత్రను అతడు మలిచిన తీరు నభూతోనభవిష్యతి. సినిమాలో కనిపించేది పరిమిత సన్నివేశాల్లోనే అయినా కానీ బాబి డియోల్ అబ్రార్ పాత్రను పరాకాష్టకు చేర్చాడు. అయితే ఆ పాత్రను తీర్చిదిద్దిన సందీప్ వంగాకే ఆ క్రెడిట్ దక్కుతుంది.
అసలు అబ్రార్ పాత్రను అలా మూగ వాడిగా ఎలా తీర్చిదిద్దారు? అన్నదానికి సందీప్ వివరణ ఇచ్చారు. ఓ షోలో కనిపించిన సందీప్ వంగా ఇలా అన్నాడు. ''హీరో-విలన్ ఫోన్ తీసుకొని ఒకరినొకరు తిట్టుకుంటూ లేదా పంచ్ లు విసురుకుంటూ కనిపించే చాలా చిత్రాలను మనం చూశాము. సినిమా అంతటా ఏదో ఒక రకమైన డైలాగ్ తో భజంత్రీ ఉంటుంది. హీరో విలన్ ఫేసాఫ్ ఉంటుంది.
ఈ సినిమా మొదటి అర్ధభాగం రణబీర్ కపూర్ పాత్రను, డియోల్ పాత్ర ప్రవేశించే ముందు తన తండ్రిపై అతడి ప్రేమను చూపించడంపైనే ఉంటుంది. ఆ తర్వాత అబ్రార్ (బాబి) పాత్ర ప్రవేశిస్తుంది. సహజంగా మన సినిమాల్లో విలన్లు భీభత్సమైన సంభాషణలు చెప్పడం చాలా చూశాము కాబట్టి, నేను అతన్ని మూగ - చెవిటి వ్యక్తిగా చూపించాలని అనుకున్నాను. క్లైమాక్స్‌లో చెవిటి, మూగ వ్యక్తి పోరాడటం అనే ఆలోచన చాలా ఎగ్జయిట్ చేసే ఆలోచన''అని వివరణ ఇచ్చాడు.
యానిమల్ లో ఆఫర్ తో బాబి డియోల్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. అతడికి వరుసగా దక్షిణాదిన భారీ ఆఫర్లు దక్కాయి. ముఖ్యంగా అతడి నటనను కీర్తించని వారు లేరు. యానిమల్ సినిమాతో రణబీర్ ని పాన్ ఇండియన్ స్టార్ ని చేసిన ఘనత మన సందీప్ వంగాదే. అలాగే బాబీకి పునర్జన్మను ఇవ్వడమే గాక, ఇందులో అతిథిగా నటించిన ట్రిప్తి దిమ్రీ కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చాడు. రొటీన్ విలన్లను చూపించే చాలా మంది దర్శకులకు నిజానికి సందీప్ వంగా ఆ క్షణం కళ్లు తెరిపించాడు అంటే అతిశయోక్తి కాదు. ఒక విలన్ ఇలాగే ఉండాలి! అని గిరి గీసుకుని చూపించే ఫిలింమేకర్స్‌కి అది కచ్ఛితంగా ఒక మేల్కొలుపు.