నా సినిమాను రాజకీయాల్లోకి లాగకండి: విశ్వక్ సేన్
ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
'లైలా' సినిమా మొదటి నుంచి మంచి బజ్‌ను అందుకుంది. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు యువతను బాగానే ఆకట్టుకున్నాయి. విశ్వక్ సేన్ మొదటిసారి లేడి గెటప్ లో కనిపించడమే సినిమాలో అసలైన హైలెట్ పాయింట్. న్యూ లుక్, మాస్ అప్పీల్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. సినిమాలో కామెడీ, యాక్షన్ కూడా కమర్షియల్ టచ్ ఇచ్చినట్టు కనిపించడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. కానీ విడుదలకు ముందే సినిమా అనవసరమైన వివాదంలో చిక్కుకుంది.
'లైలా' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వైసీపీపై ఆయన ఇన్ డైరెక్ట్ గా మాట్లాడిన మాటలు అనేకమందికి అభ్యంతరకరంగా కనిపించడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఊపందుకున్నాయి. దీంతో సినిమాలోని నటీనటులపై, మేకర్స్‌పై #BoycottLaila అనే ట్రెండ్ మొదలైంది. సినిమా టీమ్ అయితే దీనికి తామేమీ బాధ్యులం కాదని, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివేనని చెప్పినా, వివాదం తగ్గలేదు.
తాజాగా హీరో విశ్వక్ సేన్ తన సినిమాపై జరుగుతున్న ఈ అనవసరమైన రాజకీయ నాటకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతూ మరోసారి స్పందించాడు. తాను పోస్ట్ చేసే ప్రతి పోస్టర్‌ను డబుల్ చెక్ చేయాల్సిన స్థితికి వచ్చానని, ఇది తన మీద అధిక ఒత్తిడి పెంచుతోందని అన్నారు. "మా సినిమాకు సంబంధమున్న ప్రతి పోస్టర్ మా సినిమాకు మాత్రమే. ఇలాంటి అనవసర చర్చలు చేయడం మానుకోవాలి. సినిమా చూసి ఎంజాయ్ చేయండి. వ్యక్తిగత అభిప్రాయాలతో సినిమాను దెబ్బతీయకండి" అని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో తాను ఫొటోలు పెడితే, వాటిని ఇతరత్రా వివాదాలకు లింక్ చేసి అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డాడు.
సోషల్ మీడియాలో విశ్వక్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. 'నా సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ నా సినిమాకు సంబంధించినదే. గతంలోనే సోనూ మోడల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఎరుపు రంగు సూట్ ఫోటో కూడా చాలా కాలం క్రితమే తీసుకున్నదే. ప్రేమను వ్యాప్తి చేయండి, శాంతిని కాపాడండి. నా సినిమా కోసం ప్రతి పోస్టర్ లేదా ప్రచార చిత్రాన్ని పబ్లిష్ చేసేముందు రెండుసార్లు ఆలోచించాల్సిన స్థితిలో ఉండలేను.
అతనే సోనూ మోడల్. ఫిబ్రవరి 14న థియేటర్లలో అతన్ని కలవండి. సోషల్ మీడియాలో అనవసరమైన అశ్లీల భాషను ఉపయోగించడం మనకు ఏ ప్రయోజనాన్ని ఇవ్వదు. ప్రతి సారి తగ్గుతాను. నిన్న నా హృదయపూర్వకంగా బాధపడిన వారికి క్షమాపణలు చెప్పాను. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం మానేసి, శాంతిని కాపాడేందుకు ప్రయత్నించండి. #Laila #BoycottTheBoycottLaila. మళ్లీ చెప్తున్నాను – నేను నటుడిని మాత్రమే, నా సినిమాను రాజకీయాల్లోకి లాగకండి' అని విశ్వక్ మరొక వివరణ ఇచ్చారు.
ఇక విశ్వక్ అయితే 'బైకాట్ ది బైకాట్ లైలా' ట్రెండ్ తో క్లారిఫికేషన్ ఇచ్చినా ఈ వివాదం సినిమాపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. సినిమా విడుదల దగ్గర పడుతున్న క్రమంలో ఈ వివాదం ఇంకా కొనసాగితే, థియేటర్లలో ప్రభావం పడే అవకాశముంది. గతంలో వివాదాల్లో చిక్కుకున్న సినిమాలు కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే, మరికొన్నిసార్లు భారీగా నష్టపోయాయి. 'లైలా' విషయంలో ఏమి జరుగుతుందనేది ఫిబ్రవరి 14 తర్వాతే తెలుస్తుంది. అయితే సినిమా కంటెంట్ క్లిక్కయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.