విశ్వం - మార్టిన్: రిలీజ్ టైమ్ లో మరో టెన్షన్

స్థానిక డిస్ట్రిబ్యూటర్లు అప్పటి వరకు క్లియర్ చేయాల్సిన చెల్లింపులు నిలిపివేయడం వల్ల ఉదయం షోలు రద్దు అయ్యాయి.

Update: 2024-10-11 05:45 GMT

ఈ దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ లో మూడు విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల, మాస్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన విశ్వంతో పాటు కన్నడ స్టార్ ధృవ సర్జా నటించిన పాన్ ఇండియా చిత్రం మార్టిన్, అలాగే సుధీర్ బాబు ప్రధాన పాత్రలో రూపొందిన మా నాన్న సూపర్ హీరో ఇవాళ విడుదల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాల విడుదలలో పలు ప్రాంతాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తినట్టు సమాచారం.

విశ్వం విషయానికి వస్తే, నైజాం ప్రాంతంలో ఈ సినిమా సాఫీగా విడుదలైంది. అయితే ఆంధ్ర ప్రాంతంలో కొన్ని చోట్ల ఈ చిత్రానికి రిలీజ్ సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి, గుంటూరు ప్రాంతాల్లో సినిమా లైసెన్సులు ఇంకా జారీ కాలేదు. స్థానిక డిస్ట్రిబ్యూటర్లు అప్పటి వరకు క్లియర్ చేయాల్సిన చెల్లింపులు నిలిపివేయడం వల్ల ఉదయం షోలు రద్దు అయ్యాయి.

కానీ మధ్యాహ్నం నుంచి షోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇబ్బందులు పరిష్కారమైతే, సినిమా అక్కడ కూడా సాఫీగా విడుదల అవుతుంది. ఇక కన్నడ నటుడు ధృవ సర్జా నటించిన మార్టిన్ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది, ఇది పాన్ ఇండియా లెవల్ లో రూపొందిన సినిమా అయినప్పటికీ, ప్రస్తుతం కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదల అవుతోంది.

ఇతర భాషల్లో ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి. తెలుగులో, అలాగే ఇతర భాషల్లో ఉదయం షోలు రద్దు అయినట్టు సమాచారం. మరి ఆర్థిక సమస్యలు పరిష్కారం కాగానే ఈ సినిమా తెలుగులో, ఇతర భాషల్లో విడుదల అవుతుందో లేదో ఇంకా స్పష్టత లేదు. ధృవ సర్జా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి, అయితే ఇలాంటి సమస్యలు చిత్రం టీమ్ కి షాక్ గా మారాయి.

ఇక సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన మా నాన్న సూపర్ హీరో సినిమా మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగు రాష్ట్రాలలో సాఫీగా విడుదల అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులలో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాకుండా యంగ్ హీరో సుహాస్ నటించిన జనకైతే గనక సినిమా కూడా ఈ రోజు సాయంత్రం ప్రీమియర్ షోల ద్వారా విడుదల కానుంది. ఈ సినిమా కోసం నిన్నటి నుంచే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం పూర్తిస్థాయిలో రేపటినుంచే విస్తృతంగా రిలీజ్ అవుతుందని సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ దేవర సినిమా కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ వారాంతంలో మరింత బలమైన వసూళ్లు సాధించబోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News