గేమ్ ఛేంజర్‌కి సోనూసూద్‌తో చికాకులు?
ప్రస్తుతం ఈ సినిమా రాక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సాధారణ ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఒక్కడు, పోకిరి తరహా కమర్షియల్ అంశాలతో రూపొందించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ ఇదని ఇంతకుముందు శంకర్ ప్రచార వేదికపై చెప్పారు. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కి కొదవేమీ ఉండదని ట్రైలర్ రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రాక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సాధారణ ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో తమిళనాడులో సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు తళా అజిత్ ప్రకటించడం నిజంగా 'గేమ్ ఛేంజర్' టీమ్ లో ఉత్సాహం పెంచింది. అజిత్ నటించిన 'విదాయముర్చి' పండగ బరిలో దిగాల్సి ఉండగా ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా ఇది గేమ్ ఛేంజర్ కి తమిళనాడు వ్యాప్తంగా వసూళ్లు పెరగడానికి సహకరిస్తుందని అంచనా.
మరోవైపు హిందీలోను ఈ సినిమా పెద్ద హీరోలతో పోటీపడాల్సిన పనే లేకుండా విడుదలవుతోంది. ఇలాంటి సమయంలో సడెన్ గా సోనూసూద్ తాను నటిస్తూ దర్శకత్వం వహించిన 'ఫతే' చిత్రాన్ని పండగ బరిలో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించి షాకిచ్చారు. సోనూసూద్ తెలుగు సినీపరిశ్రమకు సుపరిచితుడు. చరణ్, చిరులతో సినిమాల్లో విలన్ గా నటించాడు. టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ విలన్ గా నటించాడు. అలాగే బాలీవుడ్ లో కొన్ని క్రేజీ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అందువల్ల అతడు తన సినిమాని గేమ్ ఛేంజర్ తో పోటీపడుతూ రిలీజ్ చేస్తుండడం చర్చగా మారింది. అయితే విలన్ పాత్రలు పోషించే సోనూ సూద్ .. చరణ్ తో పోటీపడగలడా? అన్నదే ఇక్కడ ప్రశ్న.
'ఫతే' టీజర్ ట్రైలర్ ని బట్టి ఘోరమైన రక్తపాతం, భారీ యాక్షన్ తో నిండిన థ్రిల్లర్ సినిమా అని అర్థమవుతోంది. అందువల్ల ఇది మాస్ ని థియేటర్లకు రప్పించే ఛాన్సుంది. అయితే గేమ్ ఛేంజర్ ఫ్యామిలీ ఆడియెన్ కి నచ్చే సినిమా. ఈ చిత్రం భారీ రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలతో తెరకెక్కలేదని ట్రైలర్ భరోసానిచ్చింది. ఇది రామ్ చరణ్ - శంకర్ సినిమాలకు అడ్వాంటేజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. కంటెంట్ కూడా జనాల్ని థియేటర్లకు రప్పించే బలం ఉన్నదే కావడం గమనార్హం. గేమ్ ఛేంజర్ కంటెంట్ పై ట్రైలర్ ఆసక్తిని పెంచగలిగింది. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో హీరో - విలన్ మధ్య టిట్ ఫర్ టాట్ గేమ్ రక్తి కట్టించబోతోంది. అలాగే శంకర్ మార్క్ సందేశం కూడా ఆకట్టుకుంటుందని అంచనా ఉంది.
ఆర్.ఆర్.ఆర్ స్టార్ నటించిన సినిమాగా 'గేమ్ ఛేంజర్'కి పోటీ ఉండదని కూడా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాదినా చరణ్ కి ఇమేజ్ పెరిగింది. అందువల్ల సోనూసూద్ సినిమా పోటీబరిలో ఉన్నా ఆర్.ఆర్.ఆర్ స్టార్ సినిమాపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే థియేటర్ల సర్ధుబాటు పరంగా కొన్ని చిక్కుల కారణంగా ఆదాయాల షేరింగ్ ఉంటుందని భావిస్తున్నారు.
రామ్ చరణ్, కియారా అద్వానీ ఇప్పటికే ముంబై సహా పలు మెట్రో నగరాల్లో ప్రచారం కోసం జెట్ స్పీడ్ తో ప్రయాణాలు చేస్తున్నారు. స్టార్ల పబ్లిసిటీ కూడా గేమ్ ఛేంజర్ కి అదనపు బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇటీవలి సలార్, కల్కి 2898 ఏడి, పుష్ప 2 లాంటి తెలుగు చిత్రాలు హిందీ బెల్ట్ నుంచి భారీ వసూళ్లు తెచ్చాయి. ఈ పరిణామం 'గేమ్ ఛేంజర్'కి ఇది ప్లస్ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు.