స్కామర్ల గేమ్: 40గంటల పాటు యూట్యూబర్ డిజిటల్ అరెస్ట్
డిజిటల్ అరెస్ట్ పేరుతో స్కామర్లు ఇల్లు ఒళ్లు గుల్ల చేస్తున్న ఘటన తాజాగా వెలుగు చూసింది.
మనీలాండరింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా సహా తీవ్రమైన నేరాలతో సంబంధం ఉన్నందున మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం! అంటూ దడ పుట్టించి డబ్బు దోచుకునే మోసగాళ్ల సంఖ్య పెరిగింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో స్కామర్లు ఇల్లు ఒళ్లు గుల్ల చేస్తున్న ఘటన తాజాగా వెలుగు చూసింది.
ఈ స్కామ్ లకు ఒకే ఒక్క కారణం.. తెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్ రిసీవ్ చేసుకోవడం అనే నేరం! ఇటీవల 40 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రముఖ యూట్యూబర్ ని స్కామర్లు బ్లాక్ చేసారు. అతడి సోషల్ మీడియాలు సహా యాక్టివిటీస్ అన్నిటినీ బ్లాక్ చేయడం ద్వారా తీవ్ర మానసిక ఆందోళనకు కారణమయ్యారు. అంతేకాదు.. అతడి నుంచి డబ్బు దోపిడీ జరిగింది. ఈ ఘటన తర్వాత విషయాన్ని బయటపెడుతూ స్కామర్ల నుంచి అలెర్ట్ చేసాడు అతడు. వివరాల్లోకి వెళితే.....
దాదాపు 7లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న బహుగుణ అనే యూట్యూబర్, ప్రభావశీలికి ఒక అన్ నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. స్కామర్లు తెలివిగా అతడిని బురిడీ కొట్టించారు. బహుగుణ మనీలాండరింగ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రస్తుతం మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నేషనల్ క్రైమ్ లో చిక్కుకున్నారు అంటూ స్కామర్లు తీవ్రంగా బెదిరించారు. అంతేకాదు పోలీసుల నుంచి బయటపడేందుకు తనకు సహాయం చేస్తామని కూడా స్కామర్లు అన్నారు. ఇదంతా వారి మధ్య ఫోన్ సంభాషణ ద్వారా జరిగింది. తర్వాత వారు అతడి కాల్ ని వాట్సాప్ వీడియో కాల్‌కు బదిలీ చేశారు. యూనిఫాంలో ఉన్న ఒక పోలీసు అధికారి, బహుగుణ భయాందోళనను మరింత తీవ్రతరం చేశాడు. బహుగుణ సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ సహా అన్నిటినీ బ్లాక్ చేయాలని, బయటి ప్రపంచం నుండి వేరు చేస్తున్నామని బెదిరించారు. ఆ ప్రకారమే అన్నీ చేసారు.
వారు తెలివిగా బహుగుణకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకున్నారు. పైగా `స్వీయ-కస్టడీ`ని విధించారు. 40 గంటలపాటు నిరంతర వీడియో కాల్‌లో ఉంచారు. అతడు ఎవరినీ సంప్రదించకుండా నిరోధించారు. అనుమానాస్పద లావాదేవీలను తెలుసుకోవాలని వారు అతడిని బ్యాంకుకు కూడా పంపారు. బ్రాంచ్ మూసివేసి ఉన్నందున బతికిపోయాడు కానీ.. .ఇంకా ఏం జరిగేదో! మోసం జరిగిందనే అనుమానంతో ఒక స్నేహితుడిని సంప్రదించాకే మోసానికి గురైనట్లు బహుగుణ గ్రహించాడు.
నేను డబ్బును పోగొట్టుకున్నాను.. నా మానసిక ఆరోగ్యాన్ని కోల్పోయాను. దీనిని నేను నమ్మలేకపోతున్నాను. అరెస్ట్ పేరుతో భయపెట్టారని బహుగుణ తన తాజా కథనంలో వెల్లడించాడు. అతడు చేసిన పెద్ద తప్పు ఏమిటి? అంటే... ఆటోమేటెడ్ ఇంటర్నేషనల్ కాల్ (+1 ప్రిఫిక్స్) అందగానే కాల్ లిఫ్ట్ చేయడమేనని వివరించాడు. ఇది అంతర్జాతీయ నంబర్. నేను పెద్దగా ఆలోచించకుండా ఫోన్ తీసాను. మీకు కొరియర్ వచ్చిందని, డెలివరీ రద్దయిందని ఆటోమేటెడ్ కాల్ పేర్కొంది. సహాయం కోసం సున్నా నొక్కండి అని వాయిస్ పేర్కొంది. సున్నా నొక్కడం వలన నా పేరు చైనాతో లింక్ అయ్యి ఉందని.. కస్టమ్స్ ద్వారా స్వాధీనం చేసుకున్న చట్టవిరుద్ధమైన వస్తువులతో కూడిన ప్యాకేజీకి లింక్ చేసి ఈ నంబర్ ఉందని భయపెట్టారు. తనకు దీంతో ఎలాంటి సంబందం లేదని తిరస్కరించినప్పటికీ స్కామర్లు అతడి ఆధార్ నంబర్, వ్యక్తిగత వివరాలను ఈ నంబర్ తో అనుసంధానించి ఉన్నాయని భయపెట్టారు. అతడిని `డిజిటల్ అరెస్ట్` లో 40గం.ల పాటు వేధించారు.
ఇలాంటి కాల్స్ భయపెట్టేవారికి మాత్రమే. ప్రతి ఒక్కరూ భయపెట్టినంత మాత్రాన ఒకే విధంగా స్పందించరు. కానీ భయపడిన పాపానికి బహుగుణకు గుణపాఠం అయిందని ఒప్పుకున్నాడు. దీన్ని మూర్ఖత్వం అని నిందించుకునే బదులు చుట్టూ ఉన్న వారికి దీని గురించి అవగాహన కల్పిస్తున్నానని తెలిపాడు. ప్రజలకు రిమైండర్ గా తన అనుభవాన్ని తెలిపానని అన్నాడు.