రైల్వేశాఖ భారీ ఏర్పాట్లు.. ఏకంగా 13 వేల ప్రత్యేక రైళ్లు
ఈ ఏడాది ప్రయాగ్ రాజ్లో నిర్వహిస్తున్న కుంభమేళాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాయి. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది.
ఈ ఏడాది ప్రయాగ్ రాజ్లో నిర్వహిస్తున్న కుంభమేళాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాయి. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ 45 రోజులతోపాటు అదనంగా కుంభమేళాకు ముందు, వెనుక మరో ఐదురోజులు ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మొత్తం 13 వేల ప్రత్యేక రైళ్లను నడిపనున్నట్లు తాజాగా ప్రకటించింది.
గంగ, యమున, సరస్వతీ నదుల పవిత్ర సంగమం ప్రయాగ్ రాజ్. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాకు చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మహా కుంభమేళాకు దేశవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా. దీంతో ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. రైల్వేశాఖ కూడా ఇందులో భాగస్వామ్యమైంది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. సుమారు 13 వేల రైళ్లు దేశం నలుమూలల నుంచి నడపనున్నారు. ఇందులో సుమారు 10 వేలు సాధారణ రైళ్లు కాగా, 3 వేలు ప్రత్యేక రైళ్లుగా చెబుతున్నారు. ఇవి 50 రోజుల పాటు నడుపుతారు. అదేవిధంగా సుదూర ప్రాంతాలకు 700 ప్రత్యేక రైళ్లు, 200-300 కిలోమీటర్ల స్వల్ప దూరానికి 1800 రైలు సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నారు. ఇవి కాకుండా ప్రయాగ్ రాజ్, చిత్రకూట్, బనారస్, అయోధ్య వంటి చుట్టుపక్కల నగరాలకు చేరుకోడానికి రింగ్ రైల్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. యాత్రికులు సాఫీగా, సురక్షితంగా ఉండేలా రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది.