సౌత్ కొరియా 'ఫోర్ బీ' ఉద్యమం బ్యాక్ గ్రౌండ్ ఇదే

అంతేకాదు.. ట్రంప్ ను అధ్యక్షుడ్ని చేసిన పురుషులకు పనిష్ మెంట్ ఇచ్చేందుకు వారి పట్ల ఫోర్ బీ ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-12 03:56 GMT

మహిళలు.. మహిళల హక్కుల్ని పెద్దగా పట్టించుకోకపోవటమే కాదు.. వారి మీద అదే పనిగా నోరు జారే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన సంగతి తెలిసిందే. ఆయన్ను వ్యతిరేకించే మహిళలు.. పురుషుల ఓట్లతోనే ట్రంప్ విజయం సాధించారంటూ నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు.. ట్రంప్ ను అధ్యక్షుడ్ని చేసిన పురుషులకు పనిష్ మెంట్ ఇచ్చేందుకు వారి పట్ల ఫోర్ బీ ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.

పెళ్లి చేసుకోం.. పిల్లల్ని కనం.. సె*క్సు చేయమనే ఈ ఉద్యమం సౌత్ కొరియాలో మొదలైంది. ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న అమెరికన్ మహిళలు.. అక్కడి మగాళ్లకు చుక్కలు చూపుతున్నారు. దీంతో.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా.. ట్రంప్ గెలుపు తమ ప్రాణాల మీదకు వచ్చిందంటూ పురుష పుంగవులు బెంగ పడుతున్నారు. ఇంతకూ ఈ ఫోర్ బీ ఉద్యమం దక్షిణ కొరియాలో ఎలా ప్రారంభమైంది? అదెప్పుడు మొదలైంది? ఏ సందర్భంలో ఈ ఉద్యమానికి అక్కడి మహిళలు తెర మీదకు తీసుకొచ్చారన్న విషయాల్లోకి వెళితే..

'బీ' (bi) పదంతో ప్రారంభమయ్యే కొరియన్ పదం నాలుగు పదాలకు సంబంధించింది. 2019లో ఈ ఫోర్ బీ అనే ఉద్యమం మొదలైంది. ఈ నాలుగు పదాలేమంటే..

బిహాన్: పెళ్లి చేసుకోం / నో డేటింగ్

బీషులాన్ : పిల్లల్ని కనరు

బీయోనే: డేటింగ్ లేదు

బీషుకుషు: శారీరక సంబంధానికి నో

ఇదంతా ఎందుకంటే సౌత్ కొరియాలో పురుషుల అధిపత్యం ఎక్కువ. మహిళల్ని తక్కువగా చూస్తారు. చివరకు జీతాల విషయంలోనూ పురుషుల కంటే మహిళలకు తక్కువ జీతాలు ఇస్తారు. ఆ తేడా కూడా చాలా ఎక్కువ. అధికారిక రికార్డుల ప్రకారం పురుషుల జీతాల కంటే మహిళల జీతాలు 31 శాతం తక్కువగా ఉంటాయి. దీనికి తోడు మహిళల మరణాల ఎక్కువ. దీనికి కారణం గృహ హింస. ఇళ్లల్లో చనిపోయిన భాగస్వామి మరణాల్లో అధికం ఇంట్లోని హింస కారణంగానే చోటు చేసుకున్నవిగా చెబుతారు.

విపరీతమైన పురుషాధిక్యత, వారి పాలనపై విసుగు చెందిన మహిళలు చేపట్టిన ఉద్యమమే ఫోర్ బీ. ఇదే ఉద్యమాన్ని ఇప్పుడు అమెరికాలోని మహిళలు మొదలు పెట్టారు. దీనికి కారణం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేపట్టిన ప్రచారమే. అబార్షన్ చట్టంపై ఉన్న వ్యతిరేకతతోనే అక్కడి మహిళలు ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున సపోర్టు చేస్తున్నారు. ఈ ఉద్యమంలో భాగంగా మహిళల్ని ద్వేషించే ఉత్పత్తులను కొనటం బంద్ చేస్తారు. సంప్రదాయంగా ఉండే కొన్ని పద్దతుల్ని సైతం వ్యతిరేకిస్తారు.

ఈ ఫోర్ బీ ఉద్యమం మన దేశంలో ఎంతవరకు సాధ్యమంటే.. అలాంటిది కష్టమనే చెప్పాలి. దీనికి కారణం.. మహిళలకు పెద్ద పీట వేయటంతో పాటు.. గడిచిన పది.. పదిహేనేళ్ల కాలంలో వచ్చిన సామాజిక మార్పులే. మహిళల మీద ఆధారపడే పురుషులు అధికంగా ఉండటం.. మహిళల సాధికారితకు పెద్దపీట వేస్తుండటంతో పాటు.. కొన్ని సంప్రదాయాల్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటం కూడా కారణం. ఈ కారణాలతోనే భారత్ లో ఫోర్ బీ ఉద్యమానికి అవకాశాల్లేవన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News