అప్పుల కుప్ప రాష్ట్రానికి సంపన్న సీఎం.. జాబితాలో టాప్

అదే సమయంలో దేశంలో అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలియాస్ దీదీ నిలిచారు.

Update: 2024-12-31 05:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర గుర్తింపును పొందారు. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రిపోర్టు ప్రకారం దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచినట్లుగా పేర్కొంది. ఆయన కుటుంబానికి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా తెలిపింది. అదే సమయంలో చంద్రబాబుకు రూ.10కోట్ల అప్పు ఉన్నట్లుగా పేర్కొంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అప్పుల కుప్పలా మారిన ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవటంగా చెప్పాలి.

అదే సమయంలో దేశంలో అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలియాస్ దీదీ నిలిచారు. ఆమె వద్ద రూ.15 లక్షల ఆస్తే ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు.. రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు సంపదను రూ.52.59 కోట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అదే సమయంలో ముఖ్యమంత్రుల సగటు వ్యక్తిగత ఆదాయం రూ.13,64,310గా పేర్కొంది.

ఈ రిపోర్టు ప్రకారం చూస్తే దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల సంపద రూ.1630కోట్లు. ఇక.. జాబితాలో టాప్ పొజిషన్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిస్తే.. రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు నిలిచారు. అదే సమయంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షల సంపదతో పేద సీఎం జాబితాలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచారు. దీదీకి ముందు ఆయనదే చోటు.

సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో మూడో స్థానంలో కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిలిచారు. ఆయనకు మొత్తం 51.93 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. ఇందులో స్థిరాస్తులు 30.61 కోట్లు కాగా.. చరాస్తులు రూ.21.32 కోట్లుగా తేల్చారు. ఇక.. అతి తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో మూడో స్థానంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిలిచారు. ఆయనకు మొత్తం 1.18 కోట్ల ఆస్తులు ఉన్నాయని..అందులో స్థిరాస్తుల వాటానే రూ.86.95 లక్షలుగా పేర్కొన్నారు.

దేశంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న అధినేతల్లో 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. హత్యాయత్్నం.. కిడ్నాప్.. ముడుపులు.. నేరపూరిత కుట్రలకు పాల్పడటం లాంటి కేసుల్ని ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు మొత్తం పది మంది ఉన్నట్లుగా తెలిపింది. ఆస్తుల విషయంలో చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News