మనుషులా..? రోబోలా..? వారానికి 90 గంటల పనా?
ఇటీవల భారతదేశంలో ఉద్యోగులు వారానికి ఎక్కువ గంటలు పని చేయాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.;
ఇటీవల భారతదేశంలో ఉద్యోగులు వారానికి ఎక్కువ గంటలు పని చేయాలనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ నాయకులు ఈ దిశగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై రాజకీయం రంగం నుంచి మొదటిసారి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు.
- అఖిలేష్ యాదవ్ స్పందన
"వారానికి 90 గంటలు పనిచేయాలని మీరు చెబుతున్నది మనుషుల గురించా? రోబోల గురించా?'' అని ప్రశ్నిస్తూ, ఇది సామాన్యుల జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందో వివరించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, కుటుంబంతో సమయం గడపడం, భావోద్వేగాలను పంచుకోవడం ప్రతి వ్యక్తికి అవసరం. కేవలం ఆర్థిక పురోగతి కొద్దిమందికి మాత్రమే లాభాన్ని కలిగిస్తే, సామాన్య ప్రజలకు దాని ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ లక్ష్యం సాధించడంలో అవినీతి ముఖ్యమైన అడ్డంకిగా నిలుస్తుందని తెలిపారు. యువతలోని క్రియేటివిటీ, ఉత్పాదకత దేశాభివృద్ధికి దోహదపడుతుందని, అయితే బీజేపీ పాలనలో ఇది సాధ్యం కాకపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
- ప్రముఖ పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు
ఇటీవల టెక్ ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాల్లోనూ ఎక్కువ గంటలు పని చేయాలనే చర్చ నడుస్తోంది.
-ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించారు.
-ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ 90 గంటలు పనిచేయాలని అభిప్రాయపడ్డారు.
- నీతిఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ 80 నుంచి 90 గంటలు పని చేయడం అవసరమని అన్నారు.
- ఉద్యోగుల అభిప్రాయాలు..
ఈ అభిప్రాయాలకు భిన్నంగా, ఉద్యోగులు మాత్రం దీనికి వ్యతిరేకంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిక పని గంటలు మానసిక ఒత్తిడిని పెంచే ప్రమాదం ఉందని, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కష్టమవుతుందని అంటున్నారు. అలాగే, ఎక్కువ పని గంటలు క్రియేటివిటీని తగ్గించడమే కాకుండా, ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వారానికి 90 గంటలు పని చేయాలని సూచించడంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దీనివల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలు ఎలా మారతాయో, మానసిక, శారీరక ఆరోగ్యంపై ఏమేరకు ప్రభావం చూపుతుందో సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల హక్కులు, వారి ఆరోగ్యం, జీవిత నాణ్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్చను ముందుకు తీసుకెళ్లడం సమాజానికే మేలని నిపుణులు సూచిస్తున్నారు.