అమరావతి నిర్మాణాలపై అప్ డేట్... ఐఐటీ హైదరాబాద్ కి పెద్ద పని!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం టాపిక్ మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే

Update: 2024-07-13 11:28 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం టాపిక్ మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో అమరావతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన నేపథ్యంలో... కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం అమరావతికి మంచి రోజులు వచ్చాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణాల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం స్పందించిన చంద్రబాబు ఏపీలో "ఏ" అంటే అమరావతి అని చెప్పిన.. దీని ప్రాధాన్యతని, ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యలో అమరావతి నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

ఇందులో భాగంగా ఐకానిక్ భవనాల నిర్మాణాలు, ఇతర భవనాల పరిస్థితి విషయంలో తాజాగా మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మొదలుపెట్టిన నిర్మాణాల్లో గత ఐదేళ్లలో ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో... వాటిని పూర్తి చేయడంతోపాటు.. మిగిలిన నిర్మాణాలపైనా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో.. అమరావతిలో మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలు, వాటి పరిస్థితి, పటిష్టతపై ముందుగా ఓ అంచనాకు రావాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు గతంలో ఫౌండేషన్ పూర్తి చేసుకున్న ఐకానిక్ భవనాలతో పాటు ఇతర నిర్మాణాలపైనా ఐఐటీ ఇంజినీర్ల చేత అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా... ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టత నిర్ధారణ కోసం ఐఐటీ చెన్నైకి బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యింది. అదే విధంగా... ప్రజాప్రతినిధులు, అధికార్లు, ఉద్యోగుల క్వార్టర్ల పటిష్టత నిర్దారణ కోసం ఐఐటీ హైదరాబాద్ కు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు నారాయణ వెల్లడించారు.

ఇలా అటు చెన్నై, ఇటు హైదరాబాద్ ఐఐటీ నిపుణులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Tags:    

Similar News