లలిత్ మోదీకి పౌరసత్వం రద్దు చేసిన వనవాటు

ఇదే సమయంలో లలిత్ మోదీ తన భారత పాస్‌పోర్టును అప్పగించేందుకు లండన్‌లోని రాయబార కార్యాలయంలో ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు.;

Update: 2025-03-10 07:42 GMT

ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ కు పురుడు పోసిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ పసిఫిక్ ద్వీప దేశమైన వనాటుకు స్థిరపడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ప్రక్రియలో ఆయన వనాటు దేశానికి చెందిన గోల్డెన్ పాస్‌పోర్టును పొందినట్లు సమాచారం. అయితే వనాటు ప్రధాని జోథం నపాట్ ఇటీవల పౌరసత్వ కమిషన్‌కు లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.

వనాటు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లలిత్ మోదీ దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇంటర్‌పోల్ స్క్రీనింగ్ సహా అన్ని ప్రామాణిక నేపథ్య తనిఖీలను పూర్తి చేశారు. ఆ సమయంలో ఎటువంటి నేరారోపణలు లేవని తేలింది. అయితే తాజాగా భారత అధికారులు ఇంటర్‌పోల్‌ను ఆయనపై హెచ్చరిక నోటీసు జారీ చేయాలని రెండుసార్లు అభ్యర్థించినట్లు తెలిసింది. తగిన ఆధారాలు లేకపోవడంతో ఇంటర్‌పోల్ ఈ అభ్యర్థనలను తిరస్కరించింది. అయినప్పటికీ స్వదేశంలో దర్యాప్తును తప్పించుకునేందుకే లలిత్ మోదీ వనాటు పౌరసత్వం పొందారని గుర్తించి, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదే సమయంలో లలిత్ మోదీ తన భారత పాస్‌పోర్టును అప్పగించేందుకు లండన్‌లోని రాయబార కార్యాలయంలో ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందిస్తూ నిబంధనల ప్రకారం దానిని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అలాగే, లలిత్ మోదీపై ఉన్న కేసును చట్ట ప్రకారం కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.

లలిత్ మోదీ ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారత అధికారుల కన్నుగప్పి గత 15 ఏళ్లుగా లండన్‌లో తలదాచుకున్నారు. ఆయనను తిరిగి భారతదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో లలిత్ మోదీ పసిఫిక్ ద్వీప దేశమైన వనాటు వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. వనాటు పౌరసత్వం వ్యాపారవేత్తలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

అక్కడ వ్యాపార సంస్థను రిజిస్టర్ చేసుకొని, దేశం బయట నుంచి ఆదాయాన్ని పొందినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే, గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టేట్ ట్యాక్స్‌లు లేవు. అంతేకాకుండా, వనాటు క్రిప్టో హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. స్థానికంగా లేదా అంతర్జాతీయంగా వచ్చే ఆదాయంపై కూడా పన్ను విధింపు ఉండదు. దీర్ఘకాలిక లాభాలపై కూడా పన్ను విధించకపోవడంతో, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేసేవారికి ఇది ఎంతో లాభదాయకంగా మారుతోంది.

Tags:    

Similar News