ఈ దెబ్బతో దాసోజు శ్రవణ్ సుడి తిరగనుందంతే
ఏం ఉన్నా లేకున్నా రాజకీయాల్లో అదృష్టం మాత్రం పక్కాగా ఉండాలి. అదే కానీ లేకుండా పదవి చేతికి వచ్చి కూడా చేజారిపోతుంది.;
ఏం ఉన్నా లేకున్నా రాజకీయాల్లో అదృష్టం మాత్రం పక్కాగా ఉండాలి. అదే కానీ లేకుండా పదవి చేతికి వచ్చి కూడా చేజారిపోతుంది. ఇందుకు చాలామంది రాజకీయ నేతలు కనిపించినా.. సమకాలీన రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా అలుపెరగని పోరు చేస్తున్న దాసోజు శ్రవణ్ కు ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా అవకాశం వచ్చింది లేదు. ఇదే ఆయన్ను ఐరెన్ లెగ్ అంటూ కొందరు గేలి చేస్తున్నా.. ఆ బాధను గుండెల్లో దాచుకొని మరీ.. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
చూస్తుంటే.. తాజాగా ఆయన మీద ఉన్న సెంటిమెంట్ మరక తీరిపోనుందనే చెప్పాలి. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫు అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ను ఎంపిక చేస్తూ గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. విషయాల మీద పట్టుతో పాటు.. ఎలాంటి అంశం మీదనైనా సరే.. తన వాదనతో కన్వీన్స్ చేసే సత్తా అతడి సొంతం. విద్యార్థి నాయకుడిగా.. ఉద్యమ నేతగా.. బీసీ నేతగా తెలంగాణ వ్యాప్తంగా సుపరిచితుడైనప్పటికీ.. పదవి విషయంలో మాత్రం ఆయనకు కొరత ఉంది.
ఐటీ ఉద్యోగిగా మంచి పొజిషన్ లో ఉండి.. రాజకీయాల మీద ఉన్న ఫ్యాషన్ తో ఎంట్రీ ఇచ్చిన దాసోజు శ్రవణ్.. ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. అప్పట్లో పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన.. ఆ తర్వాత ఆయన ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. అయినా ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండలేకపోయారు.
ఆ తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ కావటమే కాదు.. రాహుల్ గాంధీ కోటరీలో చోటు దక్కించుకున్నాడు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా సానుకూల ఫలితం రాలేదు. మళ్లీ కొంతకాలానికి బీఆర్ఎస్ లో చేరారు. ఈ మధ్యలో ఎన్నో అంశాల మీద తన వాదనలతో అందరి చూపు తన మీద పడేలా చేశారు. పలు పార్టీ మేనిఫెస్టో తయారీలోనూ కీలక పాత్ర పోషించినా.. ఆయనకు రాజ్యాంగ పదవిమాత్రం దక్కలేదు.
ఆయన సుడి ఎంత దారుణంగా ఉంటుందంటే.. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత 2023లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. సాధారణంగా ఇలాంటివి ఇట్టే అయిపోతుంటాయి. కానీ.. అప్పటి గవర్నర్ తమిళ సై ఆయన అభ్యర్థిత్వాన్ని రిజెక్టు చేశారు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. తాజాగా ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఉన్న ఐదు స్థానాలకు కాంగ్రెస్ - సీపీఐలు నాలుగు స్థానాల్లోనే పోటీ చేయటంతో.. ఉన్న ఒక్క స్థానం బీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య సరిపోతుంది కాబట్టి.. ఆయన ఈసారి రాజ్యాంగ పదవిని సొంతం చేసుకోవటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. ఈ దెబ్బతో ఆయన్ను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలకు చెక్ పడుతుందని చెప్పాలి.ఏళ్లుకు ఏళ్లుగా ఊరిస్తున్న రాజ్యాంగ పదవి ఆయన చేతికి వచ్చేలా చేయటంతో కేసీఆర్ కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పక తప్పదు.