గాల్లో విమానం.. బాంబు బెదిరింపు.. పైలెట్ ఏం చేశాడంటే?

దీంతో ఆగమేఘాలపై ఎయిర్ ఇండియా విమానం అక్కడ నుంచి వెనక్కి వచ్చేసింది.;

Update: 2025-03-10 11:20 GMT

గాల్లో విమానం.. రష్యా పక్క దేశంలో ప్రయాణం.. అసలే ఉక్రెయిన్-రష్యా వార్. ఇలాంటి సమయంలో బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆగమేఘాలపై ఎయిర్ ఇండియా విమానం అక్కడ నుంచి వెనక్కి వచ్చేసింది. ఈ బాంబు బెదిరింపు కలకలం రేపింది.

ముంబయి నుంచి న్యూయార్క్‌ వెళ్లే ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ముంబయికి తిరిగి మళ్లించారు. బోయింగ్ 777 విమానం నాలుగు గంటల ప్రయాణం అనంతరం అజర్‌బైజన్ గగనతలంలో ఉన్న సమయంలో ఈ హెచ్చరిక వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పైలట్లకు సమాచారం అందించడంతో, వారు ముంబయి వైపు విమానాన్ని మళ్లించారు.

విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన వెంటనే బాంబ్‌ డిటెక్షన్‌ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. పరిశీలన అనంతరం ఇది నకిలీ హెచ్చరికగా తేలింది. మొత్తం 322 మంది ప్రయాణికులతో విమానం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్ధారణ అనంతరం విమానం మంగళవారం తెల్లవారుజామున తిరిగి న్యూయార్క్‌కు బయల్దేరుతుందని ఎయిరిండియా ప్రకటించింది.

ఇదిలా ఉండగా, గతేడాది డిసెంబర్‌లో అజర్‌బైజన్ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురై 38 మంది మరణించిన ఘటన మరవక ముందే తాజా ఘటన ఆందోళన కలిగించింది. రష్యా క్షిపణి దాడి కారణంగా విమానం కూలిందన్న ఆరోపణలూ వచ్చాయి.

ఇటీవల ఎయిరిండియా తరచూ వివాదాల్లో నిలుస్తోంది. విమానాశ్రయంలో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్‌ సదుపాయం అందించకపోవడంతో ఆమె నడుచుకుంటూ వెళ్లి పడిపోవడం, షికాగో-దిల్లీ విమానంలో టాయిలెట్లు పనిచేయకపోవడంతో 10 గంటల ప్రయాణం అనంతరం వెనక్కి తిరిగి వెళ్లడం వంటి సంఘటనలు విమానయాన సంస్థపై విమర్శలు తెచ్చిపెట్టాయి.

Tags:    

Similar News