యనమల రగిలిపోతున్నారా ?
ఇక పొత్తులలో భాగంగా జనసేన బీజేపీలకు చెరి ఒక సీటూ ఇచ్చి టీడీపీ మూడు సీట్లు తీసుకుంది.;
తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేత అయిన యనమల రామక్రిష్ణుడుకి చట్టసభలతో రుణం తీరిపోయింది. ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం ఈ నెల 30తో ముగుస్తోంది. కొత్త వారు సభకు వస్తారు. అయిదు ఖాళీలు అయితే అందులో యనమల సీటు ఒకటి. ఇక పొత్తులలో భాగంగా జనసేన బీజేపీలకు చెరి ఒక సీటూ ఇచ్చి టీడీపీ మూడు సీట్లు తీసుకుంది.
ఈ సీట్లలో యనమల రామక్రిష్ణుడుకు చోటు దక్కలేదు. ఆ మాటకు వస్తే రేసులో ఏ దశలోనూ యనమల పేరు కనిపించలేదు. ఆశావహులు ఫలానా వారు అని ఎన్నో పేర్లు బయటకు వచ్చాయి కానీ యనమల గురించి మాత్రం ఎక్కడా వినిపించలేదు.
ఈ క్రమంలో అనుకున్నంతా అయింది అని అంటున్నారు. యనమల రామక్రిష్ణుడికి రాజకీయంగా శాశ్వత విశ్రాంతిని ఇచ్చే విధంగా ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు. యనమల చంద్రబాబుల మధ్య బంధం గొప్పది. 1995 ఎపిసోడ్ లో యనమల బాబు సీఎం కావడానికి చేసిన మేలు అంతా ఇంతా కాదు అని అంటారు. ఆయన ఆనాడు స్పీకర్ పొజిషన్ లో ఉన్నారు.
ఆగస్టు సంక్షోభం సమయంలో ముందుగా ఎన్టీఆర్ పార్టీ నుంచి బాబు అశోక్ గజపతిరాజు సహా కొందరు నేతలను సస్పెండ్ చేస్తూ వారి మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి లేఖ రాశారు. కానీ యనమల దానిని పట్టించుకోలేదని ప్రచారంలో ఉంది. ఆనక ఎన్టీఆర్ కి మెజారిటీ లేదని పదవీచ్యుతుడ్ని చేయడం జరిగిపోయింది.
అంతే కాదు మాజీ సీఎం గా సభలో మాట్లాడేందుకు ఎన్టీఆర్ కి స్పీకర్ గా యనమల చాన్స్ ఇవ్వలేదని కూడా ప్రచారంలో ఉంది. ఆనాడు సభలో అన్న గారు ఏమి మాట్లాడి ఉండేవారో అని తెలుగు జాతి ఆశగా ఎదురుచూసింది. కానీ అది జరగలేదు. ఇదంతా ఎందుకు అంటే బాబుకు అంతలా వెన్నంటి యనమల ఉన్నారు.
ఆ తరువాత బాబు కూడా యనమలకు విశేష ప్రాధాన్యత కల్పించారు. పార్టీ అధికార్మలో ఉంటే యనమల మంత్రిగా కీలక శాఖలు చూసేవారు. విపక్షంలో ఉంటే ఆయనకు కేబినెట్ ర్యాంక్ కలిగిన ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చి గౌవరించేవారు. అంతవరకూ ఎందుకు యనమల ఎమ్మెల్యేగా 2009లో ఓటమి చెందాక ఆయనను ఎమ్మెల్సీగా చేశారు బాబు. అలా రెండుసార్లు ఏకంగా 12 ఏళ్ళ పాటు 2013 నుంచి ఈ రోజు దాకా యనమల ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఈసారి కూడా ఆయనకు చాన్స్ ఇస్తారని అనుకున్నారు. కానీ జరగలేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన యనమలను పూర్తిగా పక్కన పెట్టేశారు అని అంటున్నారు. పార్టీలో కొత్త రక్తం కోసం ఈ ఎంపిక జరిగింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే యనమల కుమార్తె దివ్యకు తుని టికెట్ ఇచ్చారు. ఆమె ఎమ్మెల్యే అయ్యారు. అల్లుడు ఏలూరు ఎంపీగా ఉన్నారు. వియ్యంకుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా ఒకే కుటుంబంలో అందరికీ పదవులు ఇవ్వడం పద్ధతి కాదనే యనమల పేరుని పరిశీలించలేదని అంటున్నారు.
అయితే చంద్రబాబు వెంట ఉండి ఆయన ఉన్నతికి తన వంతుగా కృషి చేసిన యనమల తనను ఈ విధంగా దూరం పెట్టడం పట్ల రగులుతున్నారని అంటున్నారు. ఆయన తాను పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు అని అంటున్నారు. అయితే యనమల ఎంత రగిలినా మరెంత వగచినా ఫలితం ఉంటుందా అన్నదే చర్చ. తెలుగుదేశం పార్టీ ఈ రోజున పటిష్టంగా ఉంది. సీనియర్లకు మెల్లగా రెస్ట్ ఇస్తూ పోతోంది. ఈ క్రమంలో యనమల అలిగినా కలత చెందినా చేసేది ఏమైనా ఉందా అన్నదే చర్చగా ఉంది.