క్యాడర్ కి పిఠాపురం వర్మ సంచలనాత్మక పిలుపు!

ఎపుడైతే ఆయనకు సీటు రాలేదని తెలిసిందే వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశారు.;

Update: 2025-03-10 09:54 GMT

పిఠాపురం వర్మ ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారారు. ఎమ్మెల్సీ సీటు ఆయనకు తప్పకుండా ఇస్తారని అంతా అనుకుంటున్న నేపథ్యంలో భారీ షాక్ తగిలింది. మంగళగిరిలోనే గత కొన్ని రోజుల నుంచి వర్మ ఉన్నారు. ఎపుడైతే ఆయనకు సీటు రాలేదని తెలిసిందే వెంటనే వెనక్కి తిరిగి వచ్చేశారు. అయితే వర్మ రగిలిపోతున్నారని వార్తలు వచ్చాయి.

కానీ ఆయనను టీడీపీ అధినాయకత్వం బుజ్జగించింది. అనేక సమీకరణల వల్లనే ఎమ్మెల్సీ సీటు ఈ సారి ఇవ్వలేకపోతున్నామని 2027లో కచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో మెత్తబడిన వర్మ తన అనుచరులకు టీడీపీ క్యాడర్ కి పిలుపు ఇచ్చారు.

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరడం విశేషం. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తగిన న్యాయం చేస్తారు అని కూడా వర్మ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తన రాజకీయ ప్రయాణం 23 ఏళ్ళుగా కొనసాగుతోందని ఆయన చెప్పారు.

పదవి రానంత మాత్రాన తాను బాధ పడేది లేదని అన్నారు. తనకు న్యాయం చేసేందుకు చంద్రబాబు ఎపుడూ ఆలోచిస్తారని వర్మ అన్నారు. కొన్ని సమీకరణల వల్లనే చంద్రబాబు తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోవచ్చు అని వర్మ అన్నారు. ఇక తాను పిఠాపురం ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ వస్తున్నాను అని చెప్పుకున్నారు. అందువల్ల తనకు ఇదే పెద్ద పదవి అని కూడా వర్మ అనడం విశేషం.

ఎన్నికల వేళ తానూ తన కుటుంబం మొత్తం పార్టీ ఆదేశాలను పాటించి పనిచేశామని వర్మ వివరించారు. ఏపీలో చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన అన్నారు. తనకు పదవి రాలేదని క్యాడర్ దిగులు చెందవద్దని, అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడాలని సహనంతో ముందుకు సాగాలని వర్మ కోరారు.

ఇదిలా ఉంటే వర్మకు పదవి దక్కక పోవడం పట్ల చర్చ అయితే సాగుతోంది. క్యాడర్ విషయానికి వస్తే వారు పార్టీని వీడమంటున్నారు. పిఠాపురం వర్మ 2002 నుంచి తెలుగుదేశంలో ఉంటూ వచ్చారు. ఆయనకు 2014లో చంద్రబాబు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా గెలిచి మళ్ళీ టీడీపీలో చేరిపోయారు.

అలా చంద్రబాబు పట్ల వర్మ పూర్తి విశ్వాసంతో ఉంటూ వస్తున్నారు ఆయన మాట మీదనే అయిదేళ్ల పాటు కష్టపడి నియోజకవర్గంలో టీడీపీని అన్ని విధాలుగా బలోపేతం చేసుకున్నా కూడా చివరి నిముషంలో పొత్తులలో భాగంగా జనసేనకు ఈ సీటు అప్పగించారని అంటున్నారు. అంతే కాకుండా తన పోటీగానే భావించి మరీ కూటమి విజయానికి వర్మ కృషి చేశారని అంటున్నారు.

ఇక ఇప్పటికి ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. మొదట రెండు పదవులు గత ఏడాది ఖాళీ అయితే ఒక దానిని జనసేనకు ఇచ్చారు. మరొకటి టీడీపీ తీసుకుంది. ఇక ఈ మధ్యలో అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వర్మ పేరుని తీసుకోలేదు. లేటెస్ట్ గా అయిదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయితే టీడీపీకి మూడే దక్కాయి. అందులో తొలి ప్రయార్టీ వర్మకే ఇస్తారని అనుకున్నారు. కానీ దక్కలేదు. మరో రెండేళ్ళ పాటు వర్మ నిరీక్షించాలని అంటున్నారు.

అయితే ఈ లోగానే వర్మకు రాష్ట్ర స్థాయి పదవిని ఇస్తారని అంటున్నారు. టీడీపీకి బలమైన నేతగా ఉన్న వర్మను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని అంటున్నారు. పైగా వర్మ కూడా పార్టీ పట్ల వీర విధేయుడిగా ఉంటున్నారని అంటున్నారు. మొత్తానికి వర్మ క్యడర్ కి ఇచ్చిన పిలుపుతో ఆయన అసంతృప్తి అంతా చల్లారిపోయిందని అంటున్నారు.

Tags:    

Similar News