వైసీపీకి అసలైన వాయిస్ ఆ ఇద్దరేనా?

వారిలో ఒకరు అంబటి రాంబాబు అయితే రెండవ వారు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని. ఈ ఇద్దరే తాడేపల్లిలో పార్టీ ఆఫీసుకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు.

Update: 2024-09-03 03:56 GMT
వైసీపీకి అసలైన వాయిస్ ఆ ఇద్దరేనా?
  • whatsapp icon

వైసీపీ అంటే ఎన్నో గొంతుకలు. ఎంతో మంది నేతలు, ఎందరో ఫైర్ బ్రాండ్లు. పార్టీ అధికారంలో ఉన్న నాడు అందరూ మీడియా పులులే. అన్నీ బిగ్గరగా వినిపించే గొంతుకలే. తామే ప్రభుత్వం అనేట్లుగా మాట్లాడేవారు. తామే పార్టీ అన్నట్లుగానూ వ్యవహరించేవారు.

 

తలో రకంగా మాట్లాడుతూ వైసీపీలో తమ ముద్ర చాటుకునే ప్రయత్నం చేసేవారు. అయితే అదంతా గతం. ఇపుడు చూస్తే వైసీపీ ఓడిన పార్టీ. దారుణంగా ఓటమిని చవిచూసిన ఓటి పడవ లాంటి పార్టీ. అటువంటి ఓటి పడవ లాంటి పార్టీలో ఎవరు ఉంటారు. ఉన్నా ఎవరు బయటకు వచ్చి ముఖం చూపిస్తారు. అందుకే చాలా మంది సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే గప్ చుప్ అయ్యారు.

 

ఏపీలో వంద రోజుల కూటమి పాలన ఉంది. ఒక విధంగా హానీ మూన్ మెల్లగా పూర్తి అవుతోంది. ప్రభుత్వానికి హామీమూన్ అయితే కావచ్చేమో కానీ ప్రతిపక్షానికి లేదు కదా అన్న చర్చ కూడా మరో వైపు ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలు ఎపుడూ ఉంటూనే ఉంటాయి. ఇక ఏపీలో గడచిన కొద్ది నెలలలోనే ఎన్నో విషయాలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి విశాఖలో సెజ్ లో పేలుడు సంభవించి ఇరవై మంది దాకా ప్రాణాలు కోల్పోయారు ఇపుడు చూస్తే బెజవాడ వరదలులో 19 మంది దాకా మరణించారు అని చెబుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీని కాసుకోవడానికి అయినా మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఉంది కదా అన్న చర్చ ఉంది. బాలీవుడ్ నటీమణిని తెచ్చి వైసీపీ మీద కామెంట్స్ చేస్తూంటే కూడా డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితుల్లో పార్టీ పడిపోయింది. శ్వేతపత్రాలు రిలీజ్ చేసి అంతా మీ పుణ్యమే అని చెబుతున్నా తాము చేసిన తప్పు ఇది ఒప్పు ఇది అని చెప్పడానికి కూడా వైసీపీలో వీలు లేకపోతోంది అని అంటున్నారు.

అయితే వైసీపీలో ఏకంగా జగన్ మీద విమర్శలు వచ్చినా కూడా స్పందించే నేతలు కరవు అయ్యారని అంటున్నారు. ఈ సమయంలో పార్టీకి నమ్మిన నేతలుగా ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు అని అంటున్నారు. వారే వైసీపీ వాయిస్ గా మిగిలారు అని అంటున్నారు. వారిలో ఒకరు అంబటి రాంబాబు అయితే రెండవ వారు కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని. ఈ ఇద్దరే తాడేపల్లిలో పార్టీ ఆఫీసుకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు.

ఈ ఇద్దరికీ జగన్ మంత్రివర్గంలో పదవులు దక్కాయి. వీరితో పాటుగా మరో నలభై మందికి పైగా మంత్రి పదవులు అందాయి. అయినా ఇపుడు ఈ కష్ట సమయంలో ఎవరూ నోరు విప్పడం లేదు. అసలు వారు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు అని అంటున్నారు. అంతే కాదు కీలకమైన పదవులు వైసీపీలో చేపట్టి మొత్తం చక్రాలు తిప్పిన నేతలు ఎంతో మంది ఉన్నా కూడా వారు ఎవరూ కూడా ముందుకు రాని పరిస్థితి ఉందని అంటున్నారు.

ఈ ఇద్దరే ఇపుడు జగన్ కి వైసీపీకి అండగా ఉన్నారు అని అంటున్నారు. ఈ ఇద్దరు నేతలు ఆది నుంచి వైఎస్సార్ కి భక్తులు. ఆయన మీద అభిమానంతో జగన్ వైపు వచ్చారు. జగన్ తోనే వీరి తమ ప్రయాణం అని ఒట్టు పెట్టుకున్నారు ఈ ఇద్దరూ రాజకీయంగా భవిష్యత్తుని ఆలోచించుకోవడం లేదు అని అంటున్నారు.

ఇందులో పేర్ని నాని అయితే 2024లోనే రాజకీయ విరమణ ప్రకటించారు. ఇక అంబటి రాంబాబు ఆరున్నర పదుల వయసులో ఉన్నారు. ఒక విధంగా మిగిలిన నేతల మాదిరిగా ఈ ఇద్దరూ కూడా మాకెందుకీ గొడవ అని తప్పుకోవచ్చు. కానీ వీరు మాత్రం వైసీపీ కోసం జగన్ కోసం గొంతు విప్పుతూ అధికార పక్షానికి ఎప్పటికపుడు ధీటైన జవాబు ఇస్తున్నారు అని అంటున్నారు. ఈ ఇద్దరూ బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం విశేషం.

జగన్ సొంత సమాజిక వర్గం నేతల నుంచి పెద్దగా ఎవరూ సౌండ్ చేయలేకపోతున్న నేపథ్యంలో సామాజిక సమీకరణలు అంటూ ఎందరికో పదవులు ఇచ్చినా వారు కూడా గొంతు విప్పని నేపథ్యంలో ఈ ఇద్దరే వైసీపీకి సౌండ్ రీ సౌండ్ గా ఉంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ అని కాదు ఏ రాజకీయ పార్టీ అయినా తెలుసుకోవాల్సిన సత్యాలు దిద్దుకోవాల్సిన అంశాలు అన్నీ కూడా వైసీపీలోనే ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News