"వైల్డ్ ఫైర్ కాదు.. వరల్డ్ ఫైర్"... కంటిన్యూ చేస్తోన్న అంబటి!

అవును... 'పుష్ప-2' సినిమా విడుదలకు ముందు నుంచీ రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-12-05 05:49 GMT

ఇప్పుడు ఎటు చూసినా ‘పుష్ప-2’ కు సంబంధించిన సందడే కనిపిస్తోంది! ఇక, తెలుగు రాష్ట్రాల సంగతైతే చెప్పే పనేలేదు! బుధవారం నుంచి మొదలైన ఈ సందడి.. గురువారం ఉదయం పీక్స్ కి చేరింది. మరోపక్క ఈ వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... 'పుష్ప-2' సినిమా విడుదలకు ముందు నుంచీ రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకున్నారు.. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలకు అడ్డు తగులుతున్నారు.. అరచేతిని అడ్డుపెట్టి వారి సినిమాలను ఆపలేరన్నట్లుగా అంబటి రాంబాబు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

ఇక 'పుష్ప-2' ప్రదర్శించ బడుతున్న ఒకటి రెండు హాళ్ల వద్ద "మా కోసం నువ్వు వచ్చావు.. మీ కోసం మేము వస్తాం. మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే" అంటూ జగన్ - బన్నీ ఫోటోలతో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. దీంతో... ‘పుష్ప-2’ సినిమా విషయంలో పలు చోట్ల అటు బన్నీ ఫ్యాన్స్, ఇటు జగన్ ఫ్యాన్స్ కలిసి సందడి చేశారని అంటున్నారు.

ఈ క్రమంలో... ఏలూరు జిల్లా చింతలపూడి టౌన్ లోని శ్రీరత్న థియేటర్ వద్ద బుధవారం రాత్రి ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా వైసీపీ అభిమానులు సందడి చేశారు. బన్నీకి మద్దతు తెలుపుతూ జగన్ ఫోటోలున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. థియేటర్ వద్ద వైసీపీ జెండాలు పట్టుకున్న ఫ్యాన్స్ "జై జగన్.. జై జగన్" నినాదాలు చేశారు!

హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన నగరాల్లోని కొన్ని థియేటర్స్ వద్ద.. అమెరికాలోని కొన్ని థియేటర్స్ వద్ద వైసీపీ జెండాలు దర్శనమివ్వడం గమనార్హం. ఈ సమయంలో... మొదటి నుంచి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో తాజాగా స్పందించారు.

ఇందులో భాగంగా... "పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా..? కాదు.. వరల్డ్ ఫైర్" అంటూ పోస్ట్ పెట్టారు. అంతక ముందు "పుష్ప-2 తెలుగు వారికి పేరు తేవాలి" అంటూ ఆకాంక్షిస్తూ పోస్ట్ పెట్టారు అంబటి. మరోపక్క ‘పుష్ప-2’ ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుందని అంటున్నారు!

Tags:    

Similar News