దశాబ్దం క్రితం బాబు చెప్పిన మాట.. తాజాగా షా నోట!
కొన్నిసార్లు కొందరు రాజకీయ పార్టీల అధినేతల నోటి నుంచి మాటలు విన్నప్పుడు కాస్తంత కొత్తగా ఉంటాయి.
కొన్నిసార్లు కొందరు రాజకీయ పార్టీల అధినేతల నోటి నుంచి మాటలు విన్నప్పుడు కాస్తంత కొత్తగా ఉంటాయి. కొందరు కామెడీ చేసుకుంటారు. మరికొందరు ఈ మాటలేంది మహాప్రభూ అనుకుంటారు. ఇంకొందరు మాత్రం.. సదరు రాజకీయ అధినేత నోటి నుంచి వచ్చిన మాటల్ని తొందరపడి కామెంట్ చేయొద్దని.. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలన్న మాటను చెబుతుంటారు. ఈ కోవలోకే వస్తారు ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయన నోటి నుంచి వచ్చే కొన్ని మాటల్ని చాలామంది కామెడీ చేస్తుంటారు. కాలక్రమంలోఆయన చెప్పిన మాటలు వాస్తవాలుగా మారుతుంటాయి. దశాబ్దం క్రితం.. మరికాస్త వివరంగా చెప్పలంటే దాదాపు పదకొండేళ్ల క్రితం ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. ఒలింపిక్స్ కలను చెబుతూ ఉండేవారు.
భారత లో ఒలింపిక్స్ పోటీలు జరుగుతాయని.. వాటికి ఏపీ కూడా వేదికగా మారుతుందన్న మాటలు చెప్పినప్పుడు.. ఆయన మాటల్ని కామెడీ కామెడీ చేసుకున్న పరిస్థితి. కట్ చేస్తే.. ఇటీవల కాలంలో ఒలింపిక్స్ పోటీల నిర్వహణకు భారత్ రేసులోకి రావటమే కాదు.. తన ఆసక్తిని ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి లేఖ రూపంలో తెలియజేయటమే కాదు.. దానికి తగ్గట్లు తెర వెనుక ప్రయత్నాలను షురూ చేసినట్లుగా చెబుతున్నారు.
ఈ వాదనకు బలం చేకూరేలా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నోటి నుంచి ఒలింపిక్స్ కు భారత్ సిద్ధంగా ఉందని.. 2036 పోటీల్ని నిర్వహించాలన్న ఆసక్తిని వ్యక్తం చేయటం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం 38వ జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. క్రీడల్లో భారత్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని.. 2036 ఒలింపిక్స్ కు అతిథ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
2014లో ప్రధానిగా నరేందర మోడీ బాద్యతలు స్వీకరించినప్పుడు క్రీడల బడ్జెట్ రూ.800 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.3800 కోట్లకు చేరుకునన విషయాన్ని వెల్లడించారు. ఇక.. ఈ విశ్వక్రీడల్ని 2036లో భారత్ లో నిర్వహించాలని భావిస్తున్న కేంద్రం.. అందుకు వేదికగా అహ్మదాబాద్ లో చేపట్టాలన్న ఆలోచనలో ఉననట్లు చెబుతున్నారు. ముఖ్యవేదిక అహ్మదాబాద్ గా ఉన్నప్పటికి.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఈ పోటీల్ని నిర్వహిస్తారని చెబుతున్నారు. అయితే.. ఒలింపిక్స్ క్రీడా గ్రామంగా మాత్రం అహ్మదాబాద్ మారనున్నట్లుగా చెబుతున్నారు.
ఒలింపిక్స్ నిర్వహణకు సమగ్ర ప్రణాళికను త్వరలోనే ఐసీసీకి సమర్పిస్తారని తెలుస్తోంది. 2028 ఒలింపిక్స్ ను లాస్ ఏంజిలెస్.. ఆ తర్వాత 2032 ఒలింపిక్స్ కు బ్రిస్బేన్ అతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. 2036లో నిర్వహించాల్సిన ఒలింపిక్ పోటీల నిర్వహణకు పలు దేశాలు పోటీలో ఉన్నాయి. భారత్ తో పాటు దక్షిణ కొరియా.. మెక్సికో.. ఇండోనేషియా.. తుర్కియే.. పోలెండ్.. ఈజిప్ట్ దేశాలు పోటీ పడుతున్నాయి. ఇందులో భారత్ విజేతగా నిలిచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్నది తేలేందుకు మరికొంత కాలంలో తేలనుంది. ఏమైనా.. దశాబ్దం క్రితం చంద్రబాబు నోట పలికిన స్వప్నం.. ఈ రోజున వాస్తవరూపం దాల్చేందుకు వీలుగా గట్టిగా ప్రయత్నాలు జరగటం ఆసక్తికరంగా చెప్పాలి. అందుకేనేమో.. చంద్రబాబును తిట్టేవారు సైతం ఆయన్ను విజనరీగా ఒప్పుకునే విషయంలో సానుకూలంగా స్పందిస్తుంటారు.