టీడీపీతో పొత్తుపై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు!

తాజాగా ఇండియా టుడే కాంక్లేవ్‌ లో భాగంగా యాంకర్‌ అడిగిన పలు ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానాలిచ్చారు.

Update: 2024-03-16 05:21 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు ఉంటుందా.. ఉండదా అనే విషయంలో అనేక తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు చివరి క్షణంలో బీజేపీ.. టీడీపీ, జనసేన కూటమిలో చేరింది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇండియా టుడే కాంక్లేవ్‌ లో భాగంగా యాంకర్‌ అడిగిన పలు ప్రశ్నలకు అమిత్‌ షా సమాధానాలిచ్చారు. ప్రధాని మోదీని చంద్రబాబు గతంలో టెర్రరిస్ట్‌ అన్నారని.. అలాంటి వ్యక్తితో మీరెలా పొత్తు పెట్టుకున్నారు అని అమిత్‌ షాను యాంకర్‌ ప్రశ్నించారు.

దీనికి అమిత్‌ షా సమాధానమిస్తూ.. ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్ట్‌ అని ఎన్డీయే నుంచి వెళ్లిపోయారన్నారు. తాము ఆయనను వెళ్లమనలేదని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబుకు బుద్ధొచ్చిందన్నారు. దీంతో తమ వద్దకు వచ్చారని తెలిపారు. తిరిగి ఎన్డీయేలో కలుస్తానమన్నారని.. దీంతో ఆయనను కలుపుకున్నామని అమిత్‌ షా వివరించారు.

అమిత్‌ షా తాజా వ్యాఖ్యలతో ఇన్ని రోజులుగా బీజేపీ నేతలే తమను పొత్తుకు ఆహ్వానించారని.. ఎన్డీయేలో చేరాలని ఆహ్వానం పంపారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట పడినట్టయింది. పొత్తు కావాలంటే తాము చెప్పిన షరతులకు అంగీకరించాలని చంద్రబాబు బీజేపీకి పలు షరతులు పెట్టారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రచారం అంతా అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలతో బూటకమని తేలిపోయిందంటున్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుని పొత్తు కుదుర్చుకున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

కాగా ఇండియా టుడే కాంక్లేవ్‌ లోనే అమిత్‌ షాకు యాంకర్‌ మరో ప్రశ్న సంధించారు. పార్లమెంటులో ఎన్డీయే ప్రభుత్వం పెట్టిన కొన్ని బిల్లులకు వైసీపీ మద్ద­తిచ్చిందని.. మరి అలాంటప్పుడు ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదని.. చంద్రబాబుతో ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు.

దీనికి అమిత్‌ షా సమాధానం ఇస్తూ.. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇవ్వలేదన్నారు. కొన్నింటికి మాత్రమే మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న బిల్లులకే మద్దతు ఇచ్చిందని వివరించారు.

పార్లమెంట్‌లో పార్టీల పరంగా నిర్ణయాలు ఉండవని అమిత్‌ షా స్పష్టం చేశారు. ఆయా పార్టీలకు సొంత అజెండాలు, సిద్ధాంతాలు ఉంటాయని . వాటికి తగ్గట్టుగానే అంశాన్ని బట్టి అవి నడుచుకుంటాయి అని ఆయన కుండబద్దలు కొట్టారు.

Tags:    

Similar News