భారత్ లో టెస్లా ఎంట్రీపై ఆనంద్ మహీంద్రా రిప్లైకు ఫిదా కావాల్సిందే
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తరచూ తన పోస్టులతో అందరి మనసుల్ని దోచుకునే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తరచూ తన పోస్టులతో అందరి మనసుల్ని దోచుకునే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా. నిజానికి మహీంద్రా సంస్థకున్న ఇమేజ్ ను మరోస్థాయికి తీసుకెళ్లటంలో ఆనంద్ మహీంద్రా కీలక భూమిక పోషించారని చెప్పాలి. మిగిలిన వారికి ఆయనకు ఉన్న వ్యత్యాసం ఏమంటే.. రెండు వైపులా పదును ఉన్న సోషల్ మీడియాను ఆయన ఎప్పుడూ చాలా కేర్ ఫుల్ గా డీల్ చేస్తారు. వాస్తవానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారు ఏదో ఒక ఇష్యూలో అడ్డంగా బుక్ అవుతారు. కొత్త సవాళ్లను.. సమస్యల్ని ఎదుర్కొంటారు. ఈ విషయంలో ఆనంద్ మహీంద్రా మినహాయింపుగా చెప్పాలి.
తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్ల కంపెనీ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో..భారత మార్కెట్లోకి టెస్లా వస్తే దాన్ని ఎలా ఎదుర్కొంటారు? దాని నుంచి ఎదరయ్యే పోటీని ఎలా డీల్ చేస్తారు? అంటూ ఒక నెటిజన్ ఆనంద్ మహీంద్రాను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. 1991 ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత కూడా తమకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయని.. అప్పుడు మార్కెట్లోకి వచ్చిన దేశీయ.. విదేశీ కంపెనీలైన టాలా.. సుజుకీ లాంటి ఎన్నో ఇతర కంపెనీల పోటీని తట్టుకొని నిలబడిన విషయాన్ని ప్రస్తావించారు.
అదే సందర్భంలో మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టారు. 2018లో ఎలాన్ మస్క్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్న వేళలో.. ఆయనకు మద్దతు ఇస్తూ పెట్టిన పోస్టును షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. అప్పట్లో ఆయనకు ఎలా మద్దతు ఇచ్చానో ఇప్పుడు అలానే తాను ఉంటానని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు ఆయన్ను అభినందిస్తున్నారు. తమ ఉత్పత్తులపై తమకు నమ్మకం ఎక్కువని.. అందుకే టెస్లా మార్కెట్ లోకి వచ్చినా తమ సంస్థ ఇప్పుడున్న రీతిలోనే ముందుకు వెళతామని పేర్కొన్నారు.
దేశ ప్రజలు.. వినియోగదారులు ఇస్తున్న ప్రోత్సాహంతో పోటీకి తగ్గట్లు తమను తాము మార్చుకుంటామన్న ఆయన సానుకూల స్పందన నెటిజన్ల మనసు దోచుకునేలా మారింది. ఆనంద్ మహీంద్రా సమాదానాన్ని ప్రశంసిస్తూ పలువురు రీట్వీట్ చేస్తున్నారు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. రియాక్టు కావాలో.. పరిస్థితుల్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలన్న అంశంపై ఆనంద్ మహీంద్రాకు ఉన్న పట్టు అంతా ఇంతా కాదన్న విషయం తాజా పోస్టుతో మరోసారి ఫ్రూవ్ అయ్యిందని చెప్పాలి.