అనంతపురం పాలిటిక్స్‌లో 'ఒక రాధ'.. ఇద్దరు కృష్ణులు.. !
ఈ తరహా పరిస్థితి అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. నియోజకవర్గాలను బట్టి.. ఈ రాధా కృష్ణుల రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయాలు `ఒక రాధ` ఇద్దరు కృష్ణులు అన్న చందంగా మారిపోయాయి. అదేంటి? అనుకుంటున్నారా? ఔను.. నిజమే. కృష్ణాష్టమిని పురస్కరించుకుని.. ఇక్కడి ప్రజలు ఈ విషయం పైనే చర్చించుకుంటుండడం గమనార్హం. ఒక్కొక్క నియోజకవర్గాన్ని `రాధ`గా భావిస్తే.. ఈ నియోజ కవర్గంలో ఆధిపత్యం కోసం పోరాటం చేసుకుంటున్న వారు.. కృష్ణులుగా మారారన్నమాట. ఈ తరహా పరిస్థితి అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది. నియోజకవర్గాలను బట్టి.. ఈ రాధా కృష్ణుల రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
ధర్మవరంలో బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ యాదవ్ దూసుకుపోతున్నారు. కానీ, ఈ పార్టీలోనే ఉన్న వరదాపురం సూరి ఉరఫ్ గోనుగుంట్ల సూర్యనారాయణ.. తన ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు ప్రయత్ని స్తున్నారు. దీంతో ఒకే స్థానంలో ఇద్దరు కృష్ణులు పోటీ పడుతున్నారు. హిందూపురంలో వైసీపీ నాయకుల మధ్య కూడా ఇదే తరహా పోరు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన మహిళా నాయకురాలు దీపిక కేంద్రంగా ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి.
అనంతపురం అర్బన్‌లోనూ ఇదే తరహాలో రాజకీయాలు సాగుతున్నాయి.ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి హవా తగ్గిపోతోంది. ఈ స్థానం నుంచి తాజా ఎన్నికల్లో విజయం దక్కించుకున్న.. దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ అన్ని వర్గాలకు చేరువ అవుతున్నారు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన నాయకులే అయినా.. ఎక్కడా సఖ్యత అయితే కనిపించడం లేదు. దీంతో నియోజకవర్గంలో పట్టు కోసం.. వైకుంఠం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక, తాడిపత్రిలో ప్రత్యర్థుల పోరు మరింత రంజుగా ఉంది. ఇక్కడ కూడా ఒకరాధ ఇద్దరు కృష్ణుల ఉదం తమే తలపిస్తోంది. నియోజకవర్గంలో పట్టు కోసం... మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పట్టుబడుతున్నారు. కానీ, తమ హవాను తగ్గకుండా చేసుకునేందుకు జేసీ అస్మిత్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. సాధారణంగా.. ఇది అన్ని చోట్లా ఉండేదే అయినా.. ఇక్కడ రాజకీయాలు హద్దులు ఎప్పుడో దాటేశాయి. దీంతో ఇక్కడ కూడా ఒక రాధా ఇద్దరు కృష్ణుల కుమ్ములాటే కనిపిస్తోంది.