ఏపీలో కక్ష పూరిత రాజకీయాలు.. తెరలేపిందెవరు?
ఏపీలో కక్ష పూరిత రాజకీయాలకు తెరదీసింది ఎవరు? ఇదీ.. శాసన మండలిలో తాజాగా చర్చకువచ్చిన అంశం.
ఏపీలో కక్ష పూరిత రాజకీయాలకు తెరదీసింది ఎవరు? ఇదీ.. శాసన మండలిలో తాజాగా చర్చకువచ్చిన అంశం. నేరుగా ఈ విషయాన్ని రాజ్యాంగ బద్ధమైన సంస్థల్లో ప్రశ్నించేందుకు వీలు లేదు. ఈ నేపథ్యంలో వేరే మార్గంలో ఇటు అధికార కూటమి పక్షం.. అటు ప్రతిపక్ష వైసీపీ సభ్యులు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. మీరంటే మీరే.. ప్రతికార రాజకీయాలు చేస్తున్నారంటూ సభ్యులు పరస్పరం విమర్శించుకున్నారు.
వలంటీర్ల వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు వైసీపీ సభ్యులు మాట్లాడుతూ.. కక్ష పూరితంగానే ఈ వ్యవస్థ ను నిలిపి వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కక్ష పూరిత రాజకీయాల వ్యవహారం తెరమీదికి వచ్చింది. సుమారు మూడు గంటల పాటు కక్ష పూరిత రాజకీయం అనే వ్యాఖ్యలు సభను కుదిపేశాయి. మీరంటే మీరే.. కక్ష పూరితంగా వ్యవహరించారని సభ్యులు ఆరోపణలు చేసుకున్నారు. దీంతోఅసలు ఏపీలో కక్ష పూరిత రాజకీయాలకు తెరలేపింది ఎవరు? అనే చర్చ సామాన్యుల్లోనూ జరుగుతోంది.
ఇవీ.. కళ పూరిత రాజకీయాలు!
2014లో ఏపీ విభజన తర్వాత.. టీడీపీ ప్రభు్త్వం బీజేపీతో కలిసి ఏర్పడింది. ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన.. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఇందిరమ్మ ఇళ్లు.. వంటి కీలక పథకాలను నిలిపివేయలేదు. వాటిని కొనసాగించింది. అయితే.. పేర్లు మాత్రం మార్చుకుంది. అది కూడా.. ఆరోగ్య శ్రీకి ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ అని, ఇందిరమ్మ ఇళ్లకు ఎన్టీఆర్ గృహ కల్ప అని మాత్రమే పేర్లు మార్చుకుంది. ఇతర పథకాలను కూడా కొనసాగించింది. సో.. దీనిని బట్టి టీడీపీ ఎక్కడా కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడలేదు. రాజకీయంగానే వ్యవహరించింది. ఇది సర్వసాధారణం. ఎవరు అధికారంలోకి వస్తే వారి పేర్లు పెట్టుకోవడం దేశంలో ఉన్నదే.
కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అప్పటి వరకు పేదలకు పట్టెడన్నాన్ని.. రూ.5కే పెడుతున్న అన్న క్యాంటీన్లను నిలిపివేసింది. టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన రాజధాని అమరావతి ప్రతిపాదనను గుడ్డిగా గట్టెంచి.. మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చింది. టీడీపీ నేతల నిర్వహణలో ఉన్న డెయిరీలను(సంగం, హెరిటేజ్ వంటివి) మూతబడేలా వ్యవహరించింది(అవి మూతబడలేదు లేండి). చంద్రబాబు తెచ్చిన టిడ్కో ఇళ్లను అక్కసుతో అడ్డుకుంది. లబ్ధిదారులకు కేటాయించలేదు.
అంతేకాదు.. కొందరు అధికారులపై టీడీపీ సానుకూల అధికారుల ముద్ర వేసి సస్పెన్డ్ చేసింది. అక్కడితో కూడా ఆగకుండా.. కేసులు కూడా నమోదు చేసింది. ఇక, చంద్రబాబు తెచ్చిన పథకాలను కూడా నిలిపి వేసింది. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్‌లకు ఇచ్చే తోఫాలు, కానుకలను నిలిపివేసింది.. వైసీపీ ప్రభుత్వమే. పేదల పక్షపాతినని చెప్పుకొనే జగన్.. ఈ కానుకలు పేదలకు ఉద్దేశించినవేనన్న విషయాన్ని విస్మరించారు. ఇలా.. కక్ష పూరితంగా వ్యవహరించిన ప్రభుత్వం వైసీపీ సర్కారేననడంలో ఎలాంటి సందేహం లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు.