2024 ఏపీలో ఊహాతీత విజ‌యం...!

అస‌లు గెలుపు గుర్రం ఎక్కుతారా? అనుకున్న‌వారు.. గెలిచి చూపించారు. ఇంకేముంది.. టికెట్ ఇస్తే గెలుపు ఖాయం అనుకు న్నవారు.. డిపాజిట్లు కోల్పోయారు.

Update: 2024-12-31 11:30 GMT

2025 నూత‌న సంవ‌త్స‌రం వ‌చ్చేందుకు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువుంది. ఈ నేప‌థ్యంలో అనేక విష‌యాల‌కు వేదిక‌గా.. అనేక మ‌లుపుల‌కు కేంద్రంగా మారిన 2024లో ఏం జ‌రిగింద‌నే విష‌యాల‌ను అవ‌లోక‌నం చేసుకుంటే.. చిత్ర విచిత్ర అంశాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తాయి. మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయాల‌ను శాసించిన సంవ‌త్స‌రంగా 2024 చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు బీజేపీ వైపు చూసినా.. త‌న‌కు అందివ‌స్తుందో రాద‌న్న భావ‌న‌తో ఆలోచ‌న‌లో ప‌డిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బీజేపీ అందిరావ‌డం పెద్ద ప్ల‌స్ అయితే.. ఇదేస‌మ‌యంలో బీజేపీకి టీడీపీ స్నేహం క‌లిసి రావ‌డం.. డబుల్ ప్ల‌స్‌.

ఈ మొత్తానికి కార‌ణ‌మైన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు మ‌రో చ‌రిత్ర‌. వెర‌సి.. మొత్త‌గా కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డ‌డం.. బీజేపీతో చెలిమి వంటివి టీడీపీకి క‌లిసి వ‌చ్చిన ప‌రిణామాలు 2024లోనే చోటు చేసుకున్నాయి. ఇక‌, త‌మ‌దే అధికారం అనుకుని మురిసిపోయినా.. జ‌గ‌న్‌కు ఈ సంవ‌త్స‌రం చావు దెబ్బ కొట్టింది. క‌నీసంలో క‌నీసం 10 శాతం సీట్లు కూడా ద‌క్క‌క ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోసం.. హైకోర్టు ముందు చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది కూడా ఈ సంవ‌త్స‌ర‌మే.న అంతేనా.. ప్ర‌జ‌ల తీర్పు ఎంత క‌ఠినంగా ఉంటుందో కూడా.. అటు కేంద్రంలోనూ.. ఇటు ఏపీలోనూ చూపించిన సంవ‌త్స‌రం 2024.

అస‌లు గెలుపు గుర్రం ఎక్కుతారా? అనుకున్న‌వారు.. గెలిచి చూపించారు. ఇంకేముంది.. టికెట్ ఇస్తే గెలుపు ఖాయం అనుకున్నవారు.. డిపాజిట్లు కోల్పోయారు. కొంగు చాపి క‌న్నీళ్లు పెట్టినా.. క‌నిక‌రించ‌ని వారు కూడా ఉన్నారు. మొత్తంగా 2024 రాజ‌కీ యాల్లో పెను సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారింది. నాయ‌కుల‌కు కొత్త‌దారులు చూపింది. నిర‌స‌న‌లు, ఉద్య‌మాల‌కు వ్య‌తిరేకం అన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రోడ్డు బాట ప‌ట్టే రోజులు తెచ్చింది కూడా ఈ సంవ‌త్స‌ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో ఊహించని విధంగా మంత్రులు అయిన వారు.. మంత్రి ప‌ద‌వులు ఖాయ‌మ‌ని అనుకుని నిట్టూర్చిన వారి సంఖ్య లెక్క‌లేదు.

కూట‌మి స‌ర్కారు రావ‌డం ఒక కొత్త మ‌లుపు అయితే.. వ‌చ్చీరాగానే అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌ట్టాలెక్కించే క్ర‌తువును భుజాల కెత్తుకోవ‌డం.. కేంద్రం నుంచినిధులు రాబ‌ట్ట‌డం.. అధికారుల్లో చ‌ల‌నం క‌లిగించ‌డం వంటివి చంద్ర‌బాబు మార్కు పాల‌న‌కు కూడా ఈ ఏడాది పురుడు పోసింద‌నే చెప్పాలి. ఈ ఒక్క సంవ‌త్స‌రం గెలిస్తే.. మ‌న‌కు తిరుగులేద‌న్న నాయ‌కుల‌కు చాచి కొట్టింది కూడా 2024. అదేస‌మ‌యంలో అనేక మార్పుల‌కు నాంది ప‌లికింది. త‌న అనుకున్న‌వారు దూర‌మైన నాయ‌కులు.. పార్టీలు కూడా ఉన్నాయి. ఇక‌, కుటుంబ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జా స‌మ‌స్య‌లుగా మ‌లిచి విఫ‌ల‌మైన నాయ‌కులు కూడా ఈ ఏడాది స్ప‌స్టంగా క‌నిపించారు. వెర‌సి.. ఊహించ‌ని ఫ‌లితాన్ని ప్ర‌జ‌ల‌కు అందించింది 2024!!.

Tags:    

Similar News