కేబినెట్‌ భేటీకి వేళాయె.. ఇవేనా కీలక నిర్ణయాలు!

ఇందుకు సంబంధించి తొలి కేబినెట్‌ భేటీ జూన్‌ 24న సోమవారం జరగనుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో జరుగుతుంది.

Update: 2024-06-22 09:00 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సా«ధించడం.. ప్రభుత్వం ఏర్పాటు చేయడం.. శాసనసభ్యులుగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయడం అన్నీ వరుసగా జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో ఇక కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. వాటి అమలుపై దృష్టిపెట్టింది. ఇందుకు సంబంధించి తొలి కేబినెట్‌ భేటీ జూన్‌ 24న సోమవారం జరగనుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో జరుగుతుంది.

కేబినెట్‌ భేటీలో కీలక అంశాలను చర్చిస్తారని తెలుస్తోంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రధానంగా సూపర్‌ సిక్స్‌ పథకాలు, వాటి అమలు తదితర అంశాలపైన చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే జూలై 1న పెంచిన పెన్షన్‌ రూ.4000 ఇవ్వాల్సి ఉంది. పెంచిన పెన్షన్‌ ను ఏప్రిల్‌ నుంచే వర్తింపజేస్తున్న నేపథ్యంలో జూలైలో రూ.7 వేలు లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. దీనిపైనా కేబినెట్‌ భేటీలో చర్చిస్తారని టాక్‌ నడుస్తోంది.

అలాగే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే ఆయన తన తొలి పర్యటనకు పోలవరం ప్రాజెక్టును ఎంపిక చేసుకున్నారు. అలాగే రెండో పర్యటనకు రాజధాని అమరావతిని ఎంచుకున్నారు. రాజధాని ప్రాంతమంతా ఆయన కలియదిరిగారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ రెండు అంశాలను ప్రాధాన్యత అంశాలుగా పరిగణించిన నేపథ్యంలో వీటిపైనా ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసే ఆలోచనలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం పోలవరం, రాజధాని అమరావతి స్థితిగతులు, పూర్తి చేయాలంటే అయ్యే వ్యయం, గత ప్రభుత్వం ఏం చేసింది.. ఇలా అన్ని వివరాలతో శ్వేత పత్రాలు విడుదల చేయనుందని చెబుతున్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఎన్నికల హామీలు, వాటి అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చ ఉంటుందని భావిస్తున్నారు.

అన్నింటికంటే ప్రధానంగా గత జగన్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై, ముఖ్యంగా ఇసుక తవ్వకాలు, గనులను కొల్లగొట్టడం, మద్యం అమ్మకాల్లో అక్రమాలు, అవినీతిపై కూటమి ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చిస్తారని టాక్‌ నడుస్తోంది.

అదేవిధంగా గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలా, లేదా అనే అంశంపైనా కేబినెట్‌ భేటీలో చర్చిస్తారని సమాచారం. గత ప్రభుత్వం వలంటీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. వలంటీర్లపై గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వలంటీర్‌ వ్యవస్థ ఉంటుందో, లేదో ఈ కేబినెట్‌ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది.

అలాగే జగన్‌ ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపించాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలయిందని విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైనా కేబినెట్‌ లో చర్చిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక తాజా పరిస్థితులపైనా శ్వేతపత్రం విడుదల చేస్తారని చెబుతున్నారు.

Tags:    

Similar News