వైసీపీ చాన్స్ ఇవ్వడం లేదా...టీడీపీ తీసుకోవడంలేదా...!?
మరి ఏపీలో విపక్షాల సంగతి ఏంటి అన్నది చూస్తే వైసీపీకి గడచిన అయిదేళ్ల కాలంలో వచ్చిన ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో పెద్దగా సఫలం కాలేదనే అంటున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉన్నంత స్వేచ్చ ఎవరికీ ఉండదు. వారు హాయిగా జనం కోసం అంటూ ఏమైనా చేయవచ్చు. ఆకాశమే హద్దు అన్నట్లుగా దూకుడూ చేయవచ్చు. కొండ మీద కోతిని తెచ్చి పెట్టమని కూడా డిమాండ్ చేయవచ్చు. మరి ఏపీలో విపక్షాల సంగతి ఏంటి అన్నది చూస్తే వైసీపీకి గడచిన అయిదేళ్ల కాలంలో వచ్చిన ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో పెద్దగా సఫలం కాలేదనే అంటున్నారు.
అయిదేళ్ల కాలంలో అకేషనల్ గా చేసిన ఆందోళనలు తప్ప కంటిన్యూస్ గా ప్రభుత్వం మీద పోరాటం చేసిన సందర్భం లేదని కూడా అంటున్నరు. ఈ మధ్యలో రెండేళ్ల పుణ్య కాలం కాస్తా కరోనా తో పోయింది. దాంతో మిగిలిన మూడేళ్ళూ అయినా రోడ్ల మీదకు వచ్చి రోజుల తరబడి ఆందోళలను విపక్షాలు చేసాయా అంటే లేదు అనే జవాబు వస్తుంది.
ఇక ఒక షెడ్యూల్ పెట్టుకుని జనంలోకి రావడం అలా వారం పది రోజుల పాటు తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్లిపోవడమే విపక్షాలు చేస్తూ వచ్చాయని అంటున్నారు. ఇక యువగళం పాదయాత్ర నిజానికి అతి పెద్ద పోరాటంగా సాగాలి. కానీ స్టార్టింగ్ నుంచే అవాంతరాలు వస్తూ ఉన్నాయి. యువగళం స్టార్ట్ చేశాక సినీ హీరో తారకరత్న మరణించారు. ఆ తరువాత కూడా హైప్ అన్నది ఎంతలా క్రియేట్ చేసినా ఊహించినంత సానుకూలత అయితే రాబట్టుకోలేదు అని అంటున్నారు.
చివరికి చంద్రబాబు అరెస్ట్ తరువాత మూడు నెలల పాటు వాయిదా వేసి ఇపుడు ఇచ్చాపురం కాదు విశాఖలో అంటూ ముగించేస్తున్నారు. దాంతో యువగళం దానికి వచ్చిన మైలేజ్ ఎంత అన్నది ఒక చర్చగానే ఉంది. చంద్రబాబు జిల్లా టూర్లు కూడా పార్టీకి ఆశించినంతంగా ఉపయోగపడలేదు అని అంటున్నారు.
ఈ మధ్యలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దాని మీద సానుభూతిని అయినా బిల్డప్ చేసి జనంలో పార్టీని ఉంచే కార్యక్రమం చేపట్టలేకపోయారు అన్నది మరో విమర్శగా ఉంది. ఇపుడు చూస్తే ఎన్నికలు ముంచుకు వచ్చేసాయి. ఇపుడు ఏమి మాట్లాడినా జనాలకు ఎన్నికల మాటగానే ఉంటుంది. ఇలా టీడీపీ వ్యవహారం ఉంటే పవన్ కళ్యాణ్ సైతం షూటింగులు లేనపుడే మీటింగులు అన్నట్లుగా ఏపీకి వచ్చి హడావుడి చేశారు అని అంటున్నారు.
ఆయన వారాహి రధం తయారు చేయిస్తున్నపుడు ఏపీ అంతా ఆయన ఏ ఒక్క రోజూ గ్యాప్ ఇవ్వకుండా తిరుగుతారు అని అంతా అనుకున్నారు. నాడు ఎన్టీయార్ చైతన్య రధం మీద తిరిగినట్లుగా పవన్ తిరుగుతారు అని కూడా భావించారు. అయితే వారాహి యాత్ర కూడా కంటిన్యూస్ గా కాకుండా కొన్ని రోజుల పాటు మాదిరిగా సాగిపోయింది.
ఓవరాల్ గా చూస్తే ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విపక్షాలు అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకతను తమ వైపునకు తిప్పుకోవడంలో మాత్రం అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదని అంటున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా యాంటీ ఇంకెంబెన్సీని బిల్డప్ చేయడంలో విపక్షాల వద్ద సరైన వ్యూహాలు లేకుండా పోయాయి అని అంటున్నారు. ఇక చివరికి మిగిలింది ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వం తనంతట తాను పెంచుకున్న వ్యతిరేకత ఏమైనా ముంచితే అపుడు అందులో నుంచి తాము ఆల్టర్నేషన్ గా మారాలని తపిస్తున్న సీన్ అయితే ఉంది.
ఇపుడు వైసీపీలో టికెట్ల కసరత్తు జరుగుతోంది. ఇందులో ఏమైనా ముసలం పుడితే అది అడ్వాంటేజ్ అవుతుంది అన్న ఆలోచనలలోనే విపక్షాలు ఉన్నాయంటే అయిదేళ్ల పాటు చేసిన పోరాటాలు ఏమిటి వాటి ఫలితాలు ఏమిటి అన్న ప్రశ్న కచ్చితంగా వస్తుంది. ఏది ఏమైనా తమ వైపు నిలబడి రోడ్డు మీద పోరాటాలు చేస్తూ రాత్రీ పగలు లేకుండా ముందుకు సాగే పార్టీలను నాయకులనే జనాలు గుర్తిస్తారు. అందలం ఎక్కిస్తారు. మరి ఏపీలో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.