ఢిల్లీ ప్రజల ఊపిరితిత్తులు ఆ స్థాయిలో నాశనమయ్యాయా?
అవును... అశోకా యూనివర్సిటీలోని బయోసైన్సెస్ అండ్ హెల్త్ రీసెర్చ్ డీన్ అనురాగ్ అగర్వాల్ తాజాగా ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు, ప్రజల ఆరోగ్యంపై దాని ప్రభావంపై స్పందించారు.
ఢిల్లీలో కాలుష్య పరిస్థితులపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) అతి తీవ్ర స్థాయికి చేరుకోవడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఢిల్లీలో ఒక్క రోజు గాలి పీలిస్తే 45 సిగరెట్లు కాల్చినదానితో సమానం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
దీంతో... స్కూలు పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ పరిస్థితులు ఎదురయ్యాయి. మరోపక్క శ్వాసకోస సంబంధ సమస్యలు ఉన్నవారు ఏమాత్రం బయటకు రాకూడదనే హెచ్చరికలూ జారీ అయ్యాయని చెబుతున్నారు. ఈ సమయంలో షాకింగ్ వివరాలు వెల్లడించారు పరిశోధకులు, డీన్ అనురాగ్ అగర్వాల్.
అవును... అశోకా యూనివర్సిటీలోని బయోసైన్సెస్ అండ్ హెల్త్ రీసెర్చ్ డీన్ అనురాగ్ అగర్వాల్ తాజాగా ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు, ప్రజల ఆరోగ్యంపై దాని ప్రభావంపై స్పందించారు. ఈ సందర్భంగా.. ప్రాణాంతకమైన పొగమంచు ఢిల్లీలోని ప్రతీ పౌరుడి ఊపిరితుత్తులకు హాని కలిగిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదే సమయంలో... ఢిల్లీలో ప్రజల ఊపిరితిత్తులు ఎంతో కొంత మేర కచ్చితంగా నాశనం అయ్యి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు మరింత తీవ్రంగా ఇబ్బంది పడతారని అన్నారు. ప్రధానంగా ఆస్తమా, ఇన్ ఫెక్షన్లు ఉన్నవారి సమస్య వర్ణనాతీతంగా ఉంటాయని తెలిపారు.
అత్యంత సవాలుగా ఉండే వ్యాధులు ఆస్తమా, హైపర్ టెన్షన్, శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ తో పాటు గుండెపోటుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. ఇదే సమయంలో మధుమేహం, చిత్తవైకల్యం, క్యాన్సర్ ను వేగవంతం చేయడం వంటివాటికి ఈ వాతావరణ పరిస్థితులు కారణమవుతాయని వెల్లడించారు.
ఇక ఈ సమస్యకు ఎయిర్ ప్యూరిఫైయర్లు పాక్షికంగా సహాయపడగలవని చెప్పిన అగర్వాల్... అవి దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం కాలేవని తేల్చి చెప్పారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ఇళ్లు, పని ప్రదేశాల్లో వీటిని అమర్చుకోవాలని తెలిపారు. ఈ విషయంలో.. ప్యూరిఫయర్లను కొనుగోలు చేయలేని ప్రజలకు ప్రభుత్వాలు సాయం చేయాలని కోరారు!