కూటమిలో పని మంత్రులు ఎందరు ?

ప్రభుత్వం అంటే మంత్రుల పనితీరు కొలమానంగా ఉంటుంది. దాంతోనే ప్రభుత్వ పెద్దలు ఒకటికి పదిసార్లు హెచ్చరిస్తున్నారు.

Update: 2024-11-04 19:30 GMT

సరిగ్గా అయిదు నెలల క్రితం భారీ మెజారిటీతో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాకుండా మరో ఇరవై నాలుగు మందిని మంత్రులుగా తీసుకున్నారు. అందులో జనసేన నుంచి ముగ్గురికి చాన్స్ దక్కితే పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి హోదాను కల్పించారు. బీజేపీకి ఒక మంత్రి పదవిని ఇస్తే ఇరవై మంది మంత్రులు టీడీపీకి చెందిన వారే.

ఇక మంత్రివర్గం కూర్పు చూస్తే కనుక చాలా తక్కువ మంది అనుభవం కలిగిన వారు సీనియర్లు ఉన్నారు. అనేక మంది కొత్తవారే కేబినెట్ లో ఉన్నారు. నాలుగున్నర దశాబ్దాల అనుభవం కలిగిన చంద్రబాబు మంత్రివర్గంలో ఆయన కొద్ది మంది తప్ప అంతా కొత్త వారితోనే ప్రయోగం చేశారు.

గతంలో ఎపుడూ ఇలా జరగలేదు. టీడీపీ ప్రభుత్వం అంటే ఫలనా శాఖకు ఫలానా వారు అని ముందే జనాలు అనుకునేవారు. సరిగ్గా అలాగే వారికే పదవులు దక్కేవి. అలా కీలక మంత్రిత్వ శాఖలకు చూసిన వారు అంతా చాలా సీనియర్ మోస్ట్ లీడర్లుగా ఉండేవారు.

కానీ ఈ దఫా మాత్రం బాబు పొలిటికల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అన్నట్లుగా కొత్త వారికి చోటు ఇచ్చారు. నిజానికి ఈ ప్రయోగం ఏపీలో జగన్ చేసి చూపించారు. ఆయన కూడా అతి తక్కువ మందిని సీనియర్లను తీసుకుని మిగిలిన వారిని అందరినీ ఔత్సాహికుల కోటాలో చోటిచ్చారు.

ఆ ప్రయోగం బాగానే ఉన్నా ప్రభుత్వం ధాటీగా సాగడానికి మాత్రం కొంత ఇబ్బంది అయితే ఏర్పడింది. వైసీపీకి అదే చివరికి మైనస్ అయింది అని కూడా అంటూ వచ్చారు. ఇక కూటమి వైపు చూస్తే చంద్రబాబు వంటి అనుభవశాలి ఉండగా బండి సాఫీగా సాగుతుందనే అనుకున్నారు. కానీ అయిదు నెలల పాలనలో చాలా మంది మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఒకే రోజు వేరు వేరు సంఘటనలుగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరు మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు అన్నది ఆడియో లీకేజ్ ద్వారా బయటపడినట్లుగా ప్రచారం సాగింది. ఇక అదే రోజున పవన్ కళ్యాణ్ హోంమంత్రి మీద చేసిన కామెంట్స్ తో ఏపీ రాజకీయంగా అట్టుడికింది. అది విపక్షాలకు ఆయుధంగా మారింది.

ప్రభుత్వంలో ఉన్న వారే బాహాటంగా సాటి మంత్రి పనితీరు మీద చేసిన విమర్శలు అంటే అది మామూలుగా ఎవరూ చూడలేదు, సంచలనంగానే చూసారు. ఇక దీని తరువాత కూటమి ప్రభుత్వంలో పని మంత్రులు ఎంతమంది అన్న చర్చ అయితే మొదలైంది. సీనియర్ మంత్రులుగా అచ్చెన్నాయుడు, నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్ వంటి వారు కనిపిస్తున్నారు.

అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ సైతం తమ మంత్రిత్వ శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. వీరు కాకుండా చూస్తే చాలా కీలక శాఖలు చూస్తున్న వారిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే ఆర్ధిక మంత్రిగా పయ్యావుల కేశవ్ వంటి వారు రాణిస్తున్నారు. అయితే కొందరు వెనకబడిపోతున్నారు అన్నది ప్రచారంగా ఉంది. మంత్రులను కేవలం శాఖలకే పరిమితం చేయలేదు. వారికి పార్టీ పరంగా సొంత జిల్లాలా బాధ్యతలు అప్పగించారు. అంతే కాదు వారిని అభివృద్ధి కోసం పాలన కోసం వేరే జిల్లాలకు ఇంచార్జి మంత్రులుగా చేశారు.

అంటే మంత్రుల మీద గురుతర బాధ్యతలు ఉన్నాయి. వారు అంతా కలసి మంత్రిత్వ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని పాలనను కొత్త పుంతలు తొక్కించడం కాకుండా రాజకీయంగా జిల్లాలలో కూటమికి ఎదురులేని స్థితికి తీసుకుని రావాల్సి ఉంది. అంతే కాదు కో ఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంది. అభివృద్ధి విషయంలో కూడా ఆయా జిల్లాలో దూకుడుగా ఉండాలి.

మరి ఇంతటి బాధ్యతలను మోస్తున్న మంత్రులు కొత్త వారు ఎక్కువ మంది కావడంటో కొంత తడబాటు ఉంటోందని అంటున్నారు. మరి వీరిలో ఇపుడిపుడే గాడిన పడుతున్న వారు ఉన్నారు. ఇంకా గాడిన పడాల్సిన వారు ఉన్నారు. కూటమి ప్రభుత్వ నాయకత్వం అయితే మంత్రుల పనితీరుని ఎప్పటికపుడు బేరీజు వేసుకుంటోంది.

ప్రభుత్వం అంటే మంత్రుల పనితీరు కొలమానంగా ఉంటుంది. దాంతోనే ప్రభుత్వ పెద్దలు ఒకటికి పదిసార్లు హెచ్చరిస్తున్నారు. మరి మార్పు రాని వారి విషయంలో ఏమి చేస్తారు పనిమంత్రుల చిట్టాలో ఎందరు ఉంటారు ఏమిటి అన్నది మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చగానే ఉంది.

Tags:    

Similar News