బడ్జెట్ అంకెలు...సూపర్ సిక్స్ తో లింక్ కుదిరేనా ?
దాంతో ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ పధకాల మీద ఏమి చెబుతారు అన్నది అంతా గమనిస్తున్నారు.
ఏపీ బడ్జెట్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. నవంబర్ నెల రెండవ వారంలో ఏపీ శాసనసభ సమావేశం అవుతుంది అన్నది అనధికారికంగా అందుతున్న సమాచారం. అలగే నవంబర్ 11న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12న ఏపీలో కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది అని అంటున్నారు.
దాంతో ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ పధకాల మీద ఏమి చెబుతారు అన్నది అంతా గమనిస్తున్నారు. సూపర్ సిక్స్ లో రెండింటిని అమలు చేస్తున్నారు మిగిలిన వాటిని అమలు చేయాలి. అందులో ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నది ఒకటి ఉంది. అలాగే తల్లికి వందనం పధకం ఉంది. రైతులకు భరోసా పేరుతో ఇరవై వేల రూపాయలు వారి ఖాతాలో వేయడం ఇంకో పధకం. అలాగే 18 నిండిన ప్రతీ మహిళకూ నెలకు పదిహేను వేల రూపాయలు వేయడం అన్నది కూడా ఉంది.
ఇవి కాకుండా ప్రతీ నిరుద్యోగ యువకుడికీ నెలకు మూడు వేల రూపాయలు భృతి ఇస్తామని కూడా హామీ ఉంది. ఇలా చాలా హామీలు కూడా కనిపిస్తున్నాయి. ఇపుడు ఈ సూపర్ సిక్స్ కి నిధులు ఎలా బడ్జెట్ లో కేటాయించాలి అన్నది అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ కేలండర్ ని పెట్టుకుని ఒక ఏడాదితో తాను అమలు చేయగల పధకాలకు నిధులను బడ్జెట్ లో కేటాయిస్తూ వచ్చింది. అలా చూస్తే కనుక అది డెబ్బై వేల కోట్ల రూపాయలు నాటి బడ్జెట్ లో కనిపించింది.దాని కోసమే నిధులు లేక అప్పులు చేస్తూ వైసీపీ అలా ముందుకు సాగిపోయింది.
ఇపుడు చూస్తే కూటమి ప్రభుత్వం కూడా పధకాలు అమలు చేయడానికి సిద్ధపడుతోంది. పైగా వైసీపీ కంటే రెట్టింపు పధకాలు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. మరి వీటికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలీ అంటే అవి కచ్చితంగా ఏడాదికి ఒక లక్షా 20 వేల నుంచి 40 వేల కోట్ల దాకా అవుతాయని ఒక లెక్క అయితే అంచనాగా అధికార వర్గాల వద్ద ఉంది.
మొత్తం బడ్జెట్ ని మూడు లక్షల కోట్లకు అటు ఇటుగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది అని అంటున్నారు. అయితే అందులో సగానికి సగం సంక్షేమానికే పోతే ఇక పాలనకు అభివృద్ధి కార్యక్రమాలకు ఉద్యోగుల జీత భత్యాలకు ఇతర అవసరాలకు ఎలా కేటాయింపులు చేస్తారు అన్నదే అతి పెద్ద సమస్య.
ఏది ఏమైనా బడ్జెట్ అంకెలకు సూపర్ సిక్స్ హామీలకు లింక్ అన్నది ఎక్కడా కుదరడం లేదని అంటున్నారు. ఎంత మల్లగుల్లాలు పడినా కేటాయింపులు కష్టం అవుతాయని అంటున్నారు. ఇక బడ్జెట్ లో కనుక ఒకసారి కేటాయింపులు చూపించి ఆమోదముద్ర వేస్తే జనాలు వాటి మీద ఆశలు పెట్టుకుంటారు. వాటిని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అని కూడా విపక్షాలు గద్దిస్తాయి. దాంతో ఆచీ తూచీ మాత్రమే బడ్జెట్ లో ఈ పధకాలకు నిధులను కేటాయింపు చేయాల్సి ఉంది.
ఇప్పటిదాకా సూపర్ సిక్స్ పధకాలను త్వరలో అమలు చేస్తామని మంత్రుల నుంచి సీనియర్ నేతల దాకా కూటమి తరఫున చెబుతూ వచ్చారు. ఇపుడు ఏకంగా ప్రభుత్వమే శాసన సభ సాక్షిగా ఏమని చెబుతుంది ఎప్పటి నుంచి ఈ పధకాలను అమలు చేస్తారు అన్నది పూర్తిగా స్పష్టత వస్తుంది. అందువల్ల ఏపీలోని అయిదు కోట్ల మంది ప్రజల కన్ను అయితే నవంబర్ 12న మీదనే ఉన్నాయి. ఈసారి బడ్జెట్ మీద అందరూ చాలా ఆశగా ఆసక్తిగానే చూస్తున్నారు. ఇటీవల కాలంలో బడ్జెట్ సెషన్ కి కొంత ఆసక్తి అయితే తగ్గింది. కానీ ఇపుడు టీడీపీ కూటమి బడ్జెట్ మీద మాత్రం బాగా ఇంట్రెస్ట్ పెరిగింది అని చెప్పాల్సిందే.