వారెవ్వా వాట్సాప్.. ఆఫీసులకు వెళ్లే పని లేకుండా...

గత నెల 30న ప్రారంభమైన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు రెండు వారాల్లో దాదాపు 2.64 లక్షల లావాదేవీలతో అదరగొట్టింది.

Update: 2025-02-12 12:20 GMT

రెండు వారాల క్రితం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకుకొచ్చిన ఏపీ ప్రభుత్వం.. మరిన్ని ప్రభుత్వ శాఖలు, సేవలకు విస్తరించాలని చూస్తోంది. ప్రస్తుతం 161 రకాల సేవలు వాట్సాప్ ద్వారా అందుతుండగా, మరో 500 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత నెల 30న ప్రారంభమైన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు రెండు వారాల్లో దాదాపు 2.64 లక్షల లావాదేవీలతో అదరగొట్టింది.

రాబోయే రోజుల్లో సర్టిఫికెట్లు, ఇతర అవసరాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆ సేవలు అందజేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. రెండు వారాల క్రితం మొదలైన ఈ సేవలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో మరో 500 రకాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం అమరావతిలో నిర్వహించిన కార్యదర్శుల సమీక్ష సమావేశంలో సీఎం కూడా ఈ విధానంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో మున్ముందు ఏపీలో అన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ప్రస్తుతం 161 రకాల సేవలు వాట్సాప్ ద్వారా అందుతున్నాయి. ఈ విధానంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో మరో 500 రకాల సేవలు ఈ విధానం కిందకు తెచ్చేందుకు 45 రోజుల గడువు విధించింది. సర్టిఫికెట్లు, బిల్లుల చెల్లింపులు, ఆలయాల దర్శనం టికెట్లు ఇలా చాలా అంశాలను ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ కిందకు తెచ్చారు. అయితే ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి కూడా ఇదే వేదికను వాడుకోవాలని ప్రభుత్వం చూస్తోంది.

ప్రస్తుతం గ్రీవెన్స్ సెల్ లేదా స్పందన ఫిర్యాదులను కూడా వాట్సాప్ కిందకు తేవాలని ప్రభుత్వం చూస్తోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని రైల్వే టికెట్ల అమ్మకం, సినిమా టికెట్లను కూడా వాట్సాప్ ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేయాలని చూస్తోంది. భవిష్యత్ లో ఏపీలో ఏ చిన్న అంశమైనా వాట్సాప్ ద్వారా పరిష్కారమయ్యేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే ప్రస్తుతానికి వాట్సాప్ గవర్నెన్స్ పై ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదు. దీంతో భవిష్యత్తులో కూడా సమస్యలు తలెత్తకుండా ఐటీ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది.

Tags:    

Similar News