5 నెలలు...54 వేల కోట్ల అప్పు
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో పది రోజులలో అయిదు నెలలు నిండిపోతాయి.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో పది రోజులలో అయిదు నెలలు నిండిపోతాయి. దాంతో ఈ ప్రభుత్వానికి హానీమూన్ పీరియడ్ అన్నది పూర్తి అవుతోంది అని అంటున్నారు. ఈ అయిదు నెలల పనితీరు బేరీజు వేయడం టూ ఎర్లీ అని భావించినా ఇపుడున్న రోజుల్లో ప్రజల ఆకాంక్షలు వారి తొందర తనం వంటివి పరిగణనలోకి తీసుకున్నపుడు ప్రభుత్వం ఇంకా కొంత వెనకబడింది అన్న భావన కలుగుతుంది.
సూపర్ సిక్స్ హమీల విషయంలో ఇంకా అడుగులు పూర్తిగా పడలేదు అన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఇప్పటికి రెండు హామీలు నెరవేర్చారు. అవి ఒకటి పెన్షన్లను పెంచడం, రెండవది ప్రతీ పేద ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించడం. ఇక మిగిలిన హామీల విషయం చూడాల్సి ఉంది.
అభివృద్ధి విషయం చూసుకుంటే అమరావతి రాజధానిలో కదలిక అయితే మొదలైంది అన్న భావన అయితే ఉంది. పోలవరం పనులకు కేంద్రం నుంచి నిధులు తెప్పించారు. సో ఆ విషయంలో ఏదో జరుగుతుంది అన్న ఆశలు ఉన్నాయి.
అయితే ఏపీలో పాడైన రోడ్లకు ఈ రోజుకీ విముక్తి లేదు. అలాగే అభివృద్ధి అన్నది ఇంకా కాగితాల మీదనే ఉంది. సంపద సృష్టి అన్నది బాబు ఇచ్చిన నినాదం. అది తారక మంత్రంగా ఈసారి ఎన్నికల్లో పనిచేసింది. జగన్ లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు ఏపీ శ్రీలంక అవుతుంది పాకిస్థాన్ అవుతుంది అని కూడా చంద్రబాబు భయపెట్టిన ఉదంతాలు ఉన్నాయి.
అయితే అయిదు నెలలలో కూటమి ప్రభుత్వం సంపద సృష్టి చేయాలని ఆశించడం కూడా తొందరపాటే అవుతుంది. కానీ అదే సమయంలో అప్పులను ఎంతో కొంత నియంత్రించినా అది కూడా సంపద సృష్టిలో భాగమే అన్న భావన ఉంది. కానీ ఆ విధంగా అయితే పరిస్థితి లేదు అని అంటున్నారు.
దానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కేవలం అయిదు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తెచ్చిన అప్పులు అక్షరాలా 54 వేల కోట్లు అంటే ఆశ్చర్యం అనిపించినా లెక్కలు అయితే అవే నిజం అని చెబుతున్నాయి. ఇప్పటిదాకా 47 వేల కోట్లను కూటమి ప్రభుత్వం అప్పుగా తెచ్చింది. ఇపుడు మరో ఏడు వేల కోట్లకు కేంద్రం నుంచి అనుమతి పొందింది. అంటే మొత్తం అర లక్ష కోట్ల అప్పు దాటింది అన్న మాట.
ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం విధించిన నిబంధన 45 వేల కోట్లుగా ఉందని అంటున్నారు. దానిని దాటాలీ అంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని అంటున్నారు. కేంద్రంలో ఎటూ బీజేపీ నాయకత్వంలోని ఎండీయే ప్రభుత్వం ఉంది. అందులో టీడీపీ కూడా భాగస్వామ్యం గా ఉంది.
ఏపీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది అని భావించి కేంద్రం కూడా అప్పులకు పచ్చ జెండా ఊపుతోంది. అయితే గతంలో జగన్ కి సై అన్నా ఇపుడు బాబుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ అప్పుల తిప్పలు అన్నీ కూడా అయిదు కోట్ల ఆంధ్రులవే అని అంటున్నారు.
ఇక ఏపీలో సంక్షేమ పధకాలు పూర్తిగా అమలు చేయలేదు కానీ అన్నీ చేస్తే అప్పులు కూడా దొరకని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా అప్పులను తగ్గిస్తే సంపద సృష్టించినంత మేలు అని సగటు జనం అంటున్నారు. కానీ అప్పులతోనే ఏపీ బండిని కూటమి సర్కార్ లాగుతోంది. మరి ఇప్పట్లో అప్పుల బెడద ఏపీకి తప్పుతుందా అంటే ఏమో ఆ మంచి రోజులు నిజంగా వస్తాయా అన్న డౌటానుమానంలో ఏపీ పౌరులు అయితే ఉన్నారు అన్నది అసలైన వాస్తవం.