మరో పది రోజుల్లో ఎన్నికలు.. కూటమి 'నాడి' ఎలా ఉంది?
అయితే.. ఈ మూడు స్థానాల్లోనూ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు కూటమిలోని టీడీపీనే తీసుకుంది.
ఏపీలో మరో పది రోజుల్లో అంటే.. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కేవలం మూడు స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నా.. దాదాపు 70 శాతం జిల్లాల్లో ఈ ఎన్నికల ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నెల 27న జరగనున్న ఈ ఎన్నికల పోలింగ్ అనంతరం.. ఫలితాలు వెల్లడించనున్నారు.
అయితే.. ఈ మూడు స్థానాల్లోనూ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు కూటమిలోని టీడీపీనే తీసుకుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరుజిల్లాల పరిధిలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కూడా టీడీపీ నాయకుడు, సీనియర్ నేత పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. వీరి గెలుపు కూటమికి.. మరీ ముఖ్యంగా టీడీపీకి అత్యంత కీలకంగా మారింది. దీంతో సీఎం చంద్రబాబు ఇప్పటికి ఐదారుసార్లుగా.. మన వాళ్లను గెలిపించేందుకు కృషి చేయండి అని నాయకులు, మంత్రులకు కూడా తేల్చి చెప్పారు.
ఇక, క్షేత్రస్థాయిలో పరిస్తితిని గమనిస్తే.. కూటమికి కొంత సెగ తగిలే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో విద్యాధికులు(గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు) ఓటేయనున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగులు కూడా ఉన్నారు. అయితే.. వీరిపై కూటమి ప్రభుత్వ ప్రభావం ఆధారంగానే ఈ ఓటు బ్యాంకు టీడీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులు, నిరుద్యోగుల విషయంలో వ్యతిరేకత కనిపిస్తున్నట్టు తాజాగా సర్వేల్లో స్పష్టమైంది. ఉద్యోగులు తమ బకాయిలు 257 కోట్ల రూపాయలను ఇవ్వాలని గత రెండు మాసాలుగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సర్కారు నిర్లిప్తంగా ఉంది.
అదేసమయంలో 11వ పీఆర్సీ వేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైనా సర్కారు ఏమీ తేల్చలేక పోతోంది. దీంతో ఉద్యోగులు.. కూటమి వచ్చినా..తమకు కష్టాలు తప్పలేదని అంటున్నారు. ఇక, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ.. డీఎస్సీ సహా ఉద్యోగ కల్పన వంటివి కూడా ముందుకు సాగలేదు. సీఎం చంద్రబాబు మలి సంతకంగా.. డీఎస్సీపైనే చేసినా.. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీంతో వారు కూడా రగులుతున్నారన్నది తాజాగా సర్కారుకు అందిన సమాచారం. ఇక, టీచర్లు మాత్రం మిశ్రమంగా ఉన్నారు. వారి బదిలీలవిషయంలో సర్కారు సానుకూలంగా ఉండడం ఒక్కటే కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ మేరకు కూటమి ప్రభావం చూపు తుందనేది ఆసక్తిగా మారింది.